రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుము
ABN , First Publish Date - 2023-07-08T01:19:57+05:30 IST
రుషికొండ బీచ్‌లోకి ఇకపై ఎవరైనా వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలి. అంటే టిక్కెట్ తీసుకోవాలి.
రూ.20 కడితేనే లోపలికి అనుమతి
11వ తేదీ నుంచి వసూళ్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రుషికొండ బీచ్‌లోకి ఇకపై ఎవరైనా వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలి. అంటే టిక్కెట్ తీసుకోవాలి. సాగర తీర నగరమైన విశాఖలో ఇప్పటివరకు ఈ సంస్కృతి లేదు. ఆర్‌కే బీచ్‌వద్ద గానీ, భీమిలి బీచ్‌లో గానీ ఎక్కడా రుసుములు వసూలు చేయడం లేదు. రుషికొండ, తొట్లకొండ, అప్పికొండ ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు. కానీ ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్ బీచ్’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్ గార్డులు అంతా కలిసి 39 మంది పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.6 లక్షల వ్యయం అవుతోంది. ప్రభుత్వం ఈ బీచ్‌కు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. అందుకని పార్కింగ్ ఫీజు, టాయిలెట్, స్నానాల గదుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి సరిపోవడం లేదని ఇతర రాష్ట్రాల్లో బ్లూఫాగ్ బీచ్‌లను పరిశీలించారు. వాటిలో ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారని తెలిసి, ఇక్కడ కూడా అలాగే చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ఇప్పుడు అదే విషయం ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ బీచ్‌కు వచ్చే వారి నుంచి రూ.20 టిక్కెట్ వసూలు చేస్తామని ప్రకటించారు. ఈ టిక్కెట్ తీసుకునేవారు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్ జోన్, ఆటస్థలం వినియోగించుకోవచ్చు. పదేళ్ల లోపు పిల్లలకు రుసుము తీసుకోరు. పార్కింగ్ ఫీజు ఎప్పటిలాగే వసూలు చేస్తారు. ఇలా రూ.20 టిక్కెట్ అంటే చాలా మంది రుషికొండ బీచ్‌కు వెళ్లడం మానేస్తారు. ప్రభుత్వమూ అదే కోరుకుంటున్నట్టుంది. రుషికొండపై భారీ భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో...ఆ ప్రాంతంలో జనాల రాకపోకలు ఎంత తక్కువైతే అంత మంచిదని అధికారులు భావిస్తున్నారు.