దేవదాయం మొద్దునిద్ర!
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:18 AM
నగరంలోని ఆశీల్‌మెట్టలో గల సంపత్ వినాయకుని ఆలయానికి రోజుకు హుండీ ద్వారా భారీగా ఆదాయం వస్తుంటుంది.
వ్యవస్థాపకుల చేతుల్లోనే సంపత్ వినాయకుని ఆలయం
ఐదేళ్ల మినహాయింపు గత నెల 15తోనే పూర్తి
అయినా స్పందించని అధికారులు
ఈఓను నియమించకుండా జాప్యం
మరోమారు గడువు పొడిగింపునకు తాడేపల్లి చుట్టూ వ్యవస్థాపకుల వారసులు ప్రదక్షిణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని ఆశీల్‌మెట్టలో గల సంపత్ వినాయకుని ఆలయానికి రోజుకు హుండీ ద్వారా భారీగా ఆదాయం వస్తుంటుంది. అందుకే దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. అయితే ఆలయ వ్యవస్థాపకులు ఐదేళ్ల క్రితం మినహాయింపు తెచ్చుకున్నారు. ఆ గడువు గత నెల 15న ముగిసింది. నిబంధనల ప్రకారం దేవదాయ శాఖ వెంటనే ఈఓను నియమించి పాలనా వ్యవహారాలు చూసుకోవాలి. కానీ నెల దాటినా ఆ బాధ్యత తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈలోగా మళ్లీ మినహాయింపు ఆదేశాలు తెచ్చుకోవాలని నిర్వాహకుల తరపున కొందరు తాడేపల్లిలో చక్కర్లు కొడుతున్నారు.
ఇదీ ఆలయ చరిత్ర
కేరళ నుంచి వలస వచ్చిన టీఆర్ రాజేశ్వరన్ కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) ఆశీల్‌మెట్టలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన 750 గజాల స్థలం కొని అందులో భవనం నిర్మించుకుంది. దానికి ఎదురుగా అటు వైపు మరో రోడ్డు (ఎసెంట్ కాలేజీ) ఉండడంతో వాస్తుదోషం (శూల)గా భావించి అందరిలాగే భవనం ముందు 1966లో చిన్న వినాయక ఆలయం నిర్మించి ‘సంపత్ వినాయగర్’ అని పేరు పెట్టుకున్నారు. రోజూ పూజలు చేసేవారు. ప్రధాన రహదారి కావడంతో అటు వైపుగా వెళ్లేవారు ఆగి నమస్కారం చేసుకొనేవారు. భవన యజమానులే ఆలయ అర్చకులుగా ఉండేవారు. అక్కడికి వెళ్లి మొక్కుకుంటే కోరికలు తీరుతున్నాయనే భావన విస్తృతం కావడంతో రద్దీ పెరిగింది. నగరంలో ప్రజలు కొత్తగా కొన్న వాహనాలను తీసుకువచ్చి అక్కడ తొలి పూజ చేయించుకోవడం ఆనవాయితీగా మారింది. అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలతో స్వామి పేరు బాగా విస్తరించింది. ఆదాయం పెరిగింది. కాలక్రమంలో 1996లో అది దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. నిర్వహణ అంతా అధికారులే చూసుకునేవారు. మధ్యలో ఒకసారి చోళన్ కుటుంబం ప్రభుత్వ పెద్దలను కలిసి ఆలయ నిర్వహణ తామే చూసుకుంటామని చెప్పి మినహాయింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ దేవదాయ శాఖ అధికారులు పాలన పగ్గాలు తీసుకున్నారు. 2018 నవంబరు 16న ఐదేళ్లకు మినహాయింపు తెచ్చుకున్నారు. దేవదాయ శాఖ చట్టం 30/87లో సెక్షన్ 29 ప్రకారం ఈ ఆలయానికి పరిపాలన మినహాయింపు ఇచ్చారు. టీఆర్ రాజేశ్వరన్ కుమారుడు టీఆర్ చోళన్ పేరుతో ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆలయ పరిపాలన వారే చూస్తున్నారు.
మధ్యలో ఉపసంహరణ
ఇదిలావుండగా రెండేళ్ల క్రితం విశాఖపట్నం దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్‌గా వచ్చిన కె.శాంతి కొంచెం దూకుడుగా వ్యవహరించి సంపత్ ఆలయంపై దృష్టి పెట్టారు. దాంతో ఆమెను ఆ ఆలయానికి ఈఓగా పూర్తి బాధ్యతలతో నిర్వహిస్తూ ప్రభుత్వం 2021, మే 17న జీఓ నంబరు 107తో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ జీవో రాగానే ఆమె ఆలయానికి వెళ్లి ఈఓగా బాధ్యతలు తీసుకొని లొసుగులు వెదకడం ప్రాంభించారు. దీనిని అవమానంగా భావించి చోళన్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తమకు ఐదేళ్లకు మినహాయింపు ఇస్తే...ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కనీసం విచారణ కూడా చేయకుండా, లోపాలు ఏమిటో వెల్లడించకుండా దేవదాయ శాఖ అన్యాయంగా వ్యవహరించిందని 10945/2021 రిట్ పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు ఆ ఆలయం వ్యవహారాల్లో దేవదాయ శాఖ జోక్యం చేసుకోవద్దని 2021 జూన్ 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అసిస్టెంట్ కమిషనర్ శాంతి అక్కడి నుంచి ఈఓగా వెనక్కి వచ్చేసి, వారికే బాధ్యతలు ఇచ్చేశారు. ఆ ఐదేళ్ల గడువు గత నవంబరు 15తో ముగిసింది.
లేఖ రాసినా స్పందించని ఉన్నతాధికారులు
జిల్లాలో దేవదాయ శాఖాధికారులకు ఈ ఆలయ వివాదం గురించి ముందుగానే తెలిసి ఉండడంతో గడువు ముగియగానే, దానిని స్వాధీనం చేసుకోవలసి ఉందని, ఈఓని నియమించాలని కోరుతూ అమరావతిలో దేవదాయ శాఖ కమిషనర్‌కు ఇక్కడి అధికారులు లేఖ రాశారు. కానీ నెల దాటిపోయినా అక్కడి నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దాంతో నిర్వాహకులే ఇప్పటికీ ఆలయ వ్యవహారాలు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ రూ.25 లక్షల వ్యయంతో చాతుర్లక్ష హోమం జరుగుతోంది. ఇంకో వైపు నిర్వాహకులు 1964లో నిర్మించిన భవనాన్ని కూలగొట్టి, కొత్తది నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు మాత్రం ఆలయ నిర్మాణమే జరుగుతోందని భావిస్తున్నారు. పరిపాలన మినహాయింపు కోసం నిర్వాహకుల తరఫున కొందరు యత్నిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.