కొలిక్కిరాని బదిలీల ప్రక్రియ!

ABN , First Publish Date - 2023-06-03T00:52:40+05:30 IST

ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అనకాపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఉద్యోగులకు బదిలీ చేసేందుకు ఉన్నతస్థాయి అధికారులు ససేమిరా అంటున్నారు. జిల్లాలో ఒక మండలం నుంచి మరొక మండలానికి మాత్రమే బదిలీలకు పచ్చజెండా ఉపారు. దీంతో బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగిసినప్పటికీ జిల్లాలోని పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు.

కొలిక్కిరాని బదిలీల ప్రక్రియ!
జిల్లా కలెక్టర్‌ కార్యాలయం

పలు శాఖల్లో దరఖాస్తులను పరిశీలిస్తున్న హెచ్‌వోడీలు

ఖజానా, ఐసీడీఎస్‌, పంచాయతీ శాఖల్లో పూర్తి

వేరే జిల్లాలకు బదిలీలకు ‘నో’

కలెక్టరేట్‌ నుంచి విశాఖకు బదిలీ కోసం 75 మందికిపైగా దరఖాస్తు

రెండేళ్లు పూర్తికాకుండానే ఎలా వెళతారంటూ కలెక్టర్‌ అభ్యంతరం

అవసరమైతే జిల్లాలోనే వేరే మండలానికి అవకాశం ఇస్తానని వెల్లడి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అనకాపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఉద్యోగులకు బదిలీ చేసేందుకు ఉన్నతస్థాయి అధికారులు ససేమిరా అంటున్నారు. జిల్లాలో ఒక మండలం నుంచి మరొక మండలానికి మాత్రమే బదిలీలకు పచ్చజెండా ఉపారు. దీంతో బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగిసినప్పటికీ జిల్లాలోని పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు.

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆన్‌లైన్‌లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని తమకు ఎప్పుడు బదిలీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని శాఖల్లో మాత్రం జిల్లాలోనే ఒక మండలం నుంచి మరొక మండలానికి అంతర్గత బదిలీలు జరిగాయి. జిల్లా ఖజానా శాఖలో బదిలీల కోసం 48 అర్జీలు ఆన్‌లైన్‌లో అందగా ఏడుగురు ఉద్యోగులకు మాత్రమే బదిలీలు అయ్యాయి. కోటవురట్ల, మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి వెస్ట్‌ ఏటీవోలకు స్థానచలనం కల్పించారు. ఇంకా జిల్లా ఖజానా కార్యాలయం నుంచి ముగ్గురు సీనియర్‌ అకౌంటెంట్లకు బదిలీ జరిగింది.

కలెక్టరేట్‌లో బదిలీలకు కలెక్టర్‌ ససేమిరా...

గత ఏడాది జిల్లాల పునర్విభజన సమయంలో ప్రత్యేక అవసరాల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో విశాఖ నగరంలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న 150 మందికిపైగా వివిధ కేడర్ల ఉద్యోగులను అనకాపల్లి కలెక్టరేట్‌కు అత్యవసర బదిలీలు జరిపారు. వీరంతో ఏ సెక్షన్‌ నుంచి డీ సెక్షన్‌ వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సగం మంది ఉద్యోగులు సాధారణ బదిలీల కోసం మళ్లీ విశాఖ వెళ్లిపోయేందుకు అర్జీలు పెట్టుకున్నారు. ఏడాది సర్వీసు పూర్తి చేసిన 45 మంది రిక్వస్ట్‌ బదిలీలు పెట్టుకున్నట్టు సమాచారం. కొంతమంది అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలు చూపి దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే కలెక్టరేట్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడంపై కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. విశాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులనే అనకాపల్లి జిల్లాకు బదిలీ చేశారని, మళ్లీ ఇప్పుడు విశాఖకు బదిలీ చేయాలని ఎలా అడుగుతున్నారని కలెక్టర్‌ ప్రశ్నించినట్టు సమాచారం. అవసరమైతే అనకాపల్లి జిల్లాలోనే ఇతర మండలాలకు అవకాశం ఇస్తానని, విశాఖ జిల్లాకు మాత్రం బదిలీకి అంగీకరించేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో విశాఖకు బదిలీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న కలెక్టరేట్‌ ఉద్యోగులు డీలా పడ్డారు.

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 17 మందికి బదిలీలు అయ్యాయి. వీరిలో 15 మంది సూపర్‌వైజర్లు వున్నారు. ఇంకా ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, మరో సీనియర్‌ అసిస్టెంట్‌కు జిల్లాలోనే ఒక ప్రాజెక్టు నుంచి మరొక ప్రాజెక్టుకు బదిలీ చేసినట్టు పీడీ ఉషారాణి తెలిపారు. సీడీపీఓలకు బదిలీలు జరగలేదు.

జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో 11 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. బదిలీల కోసం 68 మంది ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుని అర్జీలు పెట్టుకున్న వారు, ఇతర జిల్లాకు బదిలీ కావాలని అడిగిన వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదు. ఐదేళ్లు సర్వీసు పూర్తయిన గ్రేడ్‌-1 పంచాయతీ సెక్రటరీ ఒకరు, గ్రేడ్‌-2 పంచాయతీ సెక్రటరీలు ఇద్దరు, గ్రేడ్‌-3 సెక్రటరీలు నలుగురు, గ్రేడ్‌-5 సెక్రటరీలు నలుగురిని బదిలీ చేశారు. గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు మరో రెండు రోజులు గడువు ఇవ్వడంతో ఈ నెల పదో తేదీ నాటికి వారి బదిలీలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం జిల్లా విద్యాశాఖాధికారులు అర్హుల జాబితాను విశాఖపట్నం డీఈఓకు పంపారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఒప్పంద ఉద్యోగులు తమకు కూడా రిక్వెస్ట్‌ బదిలీలకు అవకాశం ఇవ్వాలని డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జిల్లాలో పరిషత్‌, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, పశుసంవర్థకశాఖల్లో రిక్వెస్ట్‌ బదిలీల కోసం అందిన అర్జీలను ఆయా శాఖల హెచ్‌ఓడీలు (ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో) పరిశీలిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ ముగియనుంది.

Updated Date - 2023-06-03T00:52:40+05:30 IST