వీఎస్‌ఏలు లేకుండానే ‘ఉపాధి’ సోషల్ ఆడిట్
ABN , First Publish Date - 2023-01-29T00:52:01+05:30 IST
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు ఉద్దేశించిన సామాజిక తనిఖీ తూతూమంత్రంగా సాగుతోంది. ఇందుకోసం నిర్దేశించిన సిబ్బంది (వీఎస్‌ఏ) నియామకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆడిట్ బాధ్యత స్టేట్ రీసోర్సు పర్సన్ (ఎస్‌ఆర్‌పీ) పర్యవేక్షణలో జిల్లా రీసోర్సు పర్సన్‌పై పడింది. పనిభారంతో ఆడిట్‌లో పారదర్శకత లోపిస్తుండడం అక్రమార్కుల పాలిట వరంగా పరిణమిస్తోంది.
వీఎస్‌ఏలు లేకుండానే ‘ఉపాధి’ సోషల్ ఆడిట్
33 పంచాయతీల్లో డీఆర్పీలతోనే సరిపెడుతున్న వైనం
నిధులు మంజూరు కాక నిలిచిన వీఎస్‌ఏల నియామకం
కొయ్యూరు, జనవరి 28:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు ఉద్దేశించిన సామాజిక తనిఖీ తూతూమంత్రంగా సాగుతోంది. ఇందుకోసం నిర్దేశించిన సిబ్బంది (వీఎస్‌ఏ) నియామకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆడిట్ బాధ్యత స్టేట్ రీసోర్సు పర్సన్ (ఎస్‌ఆర్‌పీ) పర్యవేక్షణలో జిల్లా రీసోర్సు పర్సన్‌పై పడింది. పనిభారంతో ఆడిట్‌లో పారదర్శకత లోపిస్తుండడం అక్రమార్కుల పాలిట వరంగా పరిణమిస్తోంది.
పాడేరు జిల్లాలోని కొయ్యూరు మండలంలో 2021-22 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు సుమారు రూ.54 కోట్ల వ్యయంతో ఉపాధి హామీ పథకం కింది చేపట్టిన పనులపై ఈ నెల 26 నుంచి సామాజిక తనిఖీలు ప్రారంభించారు. 33 పంచాయతీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో అన్ని పనులను పరిశీలించి, అవకతవకలు గుర్తించేందుకు వీలుగా ఫిబ్రవరి 6 వరకు షెడ్యూల్ ఖరారు చేశారు. కాగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సి ఉండగా 2021 నుంచి కరోనా కారణంగా ఆడిట్ ప్రక్రియ నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టిన పనులపై ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా గతంలో ప్రతి పంచాయతీకు ఒక డీఆర్పీతో పాటు ఇద్దరు వీఎస్‌ఏలను నియమించేవారు. వారు ఆయా పంచాయతీల పరిధిలోని ప్రతి పనిని పరిశీలించడంతో పాటు కూలీలకు అందించిన వేతనం, వారి శారీరక, మానిసక దారుఢ్యం, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన మెటీరియల్ వినియోగం, పనుల్లో నాణ్యత, తదితర అంశాలను పరిశీలించాలి. లోపాలు గుర్తించి, పాల్పడిన అవినీతిపై నివేదికలు రూపొందించి గ్రామసభలో వెల్లడించాలి.
ప్రస్తుతం వీఎస్‌ఏల నియామకం చేపట్టకుండానే ఆడిట్ నిర్వహిస్తున్నారు. ప్రతి పంచాయతీకు ఒక డీఆర్పీకు బదులుగా నాలుగు పంచాయతీలకు ఒకరిని నియమించారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరడం లేదు. ఉపాధి హామీ పథకం అవినీతికి కేంద్రంగా మారుతోందన్న విమర్శల నేపథ్యంలో సిబ్బంది నియామకం చేపట్టకుండానే సామాజిక తనిఖీలు చేపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిసితి అక్రమార్కులకు వరంలా పరిణమిస్తోంది. రెండేళ్లకు ఒకేసారి తనీఖలు చేస్తుండడంతో తూతూమంత్రంగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీల పరిధిలో వీఆర్పీలు, టీఏలు సూచించిన రెండు, మూడు పనులు పరిశీలించి, వీధి చివర కూలీలను సమావేశ పరిచి, మస్తర్ల వివరాలు సేకరించి ఆడిట్ అయిందనిపిస్తున్నారు.
కేంద్రం నిధులిచ్చినా...
సామాజిక తనిఖీలకు నిర్దేశించిన వీఎస్‌ఏల నియామకానికి కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని తెలుస్తోంది. ఈ కారణంగానే వారిని నియమించలేదని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రభావం పనుల తనిఖీల్లో పడుతోందన్నారు.