ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2023-03-22T01:53:26+05:30 IST
డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మంగళవారం వర్క్ టు రూల్ పాటించారు.
వర్క్ టు రూల్ ప్రారంభం
సాయంత్రం ఐదు గంటలకు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మంగళవారం వర్క్ టు రూల్ పాటించారు. జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలతోపాటు డివిజనల్, తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో పలువురు ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై సాయంత్రం ఐదు గంటలకు నిష్క్రమించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఉద్యోగులు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతిలో భాగస్వాములుగా వున్న మిగిలిన కార్యాలయాల్లోని ఉద్యోగులు కూడా సాయంత్రం ఐదు గంటలకు వెళ్లిపోయారు. దీంతో అనేక కార్యాలయాలు సాధారణ రోజులతో పోలిస్తే భిన్నంగా కనిపించాయి. సాధారణంగా ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో ఉన్న పనిని బట్టి వేగంగా రావడం, ఆలస్యంగా వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ ఉద్యోగులు వర్క్ టు రూల్ పాటించడంతో తహసీల్దార్, ఇతర రెవెన్యూ కార్యాలయాలు సాయంత్రం బోసిపోయి కనిపించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.