ఎలమంచిలి వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ABN , First Publish Date - 2023-09-20T01:31:27+05:30 IST
ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మండల అధ్యక్షుల నియామకంపై తాజాగా రెండు వర్గాల నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సమక్షంలోనే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు.

నియోజకవర్గంలో మంత్రి గుడివాడ అమర్, ఎమ్మెల్యే కన్నబాబురాజు వర్గాలు
అచ్యుతాపురం మండల అధ్యక్ష పదవిపై తాజాగా వివాదం
జిల్లా అధ్యక్షుని సమక్షంలోనే మంత్రి వర్గీయులపై దాడి
పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు
అనకాపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మండల అధ్యక్షుల నియామకంపై తాజాగా రెండు వర్గాల నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సమక్షంలోనే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు.
అచ్యుతాపురం మండలం దుప్పితూరుకు చెందిన దేశంశెట్టి శంకరరావును నాలుగు రోజుల కిందట ఎమ్మెల్యే కన్నబాబురాజు వైసీపీ మండలాధ్యక్షుడిగా నియమించారు. శంకరరావుకు వరుసగా రెండోసారి మండల పార్టీ బాధ్యతలు అప్పగించడంపై మంత్రి వర్గీయులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మేరకు శంకరరావుకు వ్యతిరేకంగా మంత్రి వర్గీయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ద్వారపురెడ్డి బాబ్జీ వైసీపీ వాట్సాప్ గ్రూఫులో మెసేజ్ పెట్టారు. బాబ్జీపై శంకరరావు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండల నాయకులు కొంతమంది ఇరువర్గాలను జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సమక్షంలో కూర్చోబెట్టి రాజీ కుదిర్చాలని భావించారు. సోమవారం సాయంత్రం అచ్యుతాపురంలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శంకరరావు అనుచరులతో కలిసి బాబ్జీపై దాడి చేసినట్టు చెబుతున్నారు. చర్చలకు పిలిచి దాడులకు పాల్పడడంపై మంత్రి వర్గీయులు బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా...అధికార పార్టీ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని సమాచారం. పార్టీకి చెడ్డపేరు వస్తుందని పార్టీ పెద్దలు కొంతమంది కేసులు నమోదు చేయవద్దని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.