వివాదాల రేవు
ABN , First Publish Date - 2023-07-21T01:30:03+05:30 IST
విశాఖపట్నం పోర్టు, మత్స్యకారుల మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ప్రతి చిన్న అంశం వివాదాస్పదమవుతోంది.
పోర్టు, మత్స్యకారుల మధ్య తరచూ ఏదో ఒక వివాదం
ఇరువర్గాల మధ్య పెరుగుతున్న దూరం
మొన్నటి వరకు ఫిషింగ్ హార్బర్‌లో అభివృద్ధి పనులపై గొడవ
ఇప్పుడు చార్జీల పెంపు, బకాయిల వసూళ్ల నిర్ణయంపై...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం పోర్టు, మత్స్యకారుల మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ప్రతి చిన్న అంశం వివాదాస్పదమవుతోంది. పోర్టు యాజమాన్యం రూ.152 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి చర్యలు చేపడితే...ఆ పనులు జరగకుండా కొందరు అడ్డుపడ్డారు. హార్బర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తమకు చూపించడం లేదని అభ్యంతరాలు లేవనెత్తారు. వాస్తవానికి హార్బర్ అభివృద్ధి వల్ల ప్రయోజనం ఒనగూరేది మత్స్యకారులకే. ఆ సంగతిని పక్కనపెట్టి, హార్బర్‌లో అభివృద్ధి పనులన్నీ తమ కనుసన్నల్లో జరగాలని కొంతమంది కోరుకోవడమే వివాదానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అంశంపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఇరువర్గాలతో పాటు ఎంపెడా, ఎగుమతి, దిగుమతిదారులను కూడా సమావేశ పరిచి హార్బర్‌లో వారికి అవసరమైన నిర్మాణాలపై పోర్టు యాజమాన్యాన్ని ఒప్పించారు. దాంతో తాత్కాలికంగా హార్బర్ అభివృద్ధి పనులకు అడ్డంకులు తొలగిపోయాయి.
తాజాగా ఫీజుల వివాదం
హార్బర్‌ను ఉపయోగించుకునే మత్స్యకారుల నుంచి వసూలు చేసే ఫీజులను పోర్టు యాజమాన్యం ఇటీవల పెంచింది. అవి అధికంగా ఉన్నాయని, వాటిని చెల్లించలేమని మత్స్యకార నాయకులు అంటున్నారు. ఫీజులు చాలా ఏళ్లుగా పెంచలేదని, పెంచిన మొత్తం చాలా స్వల్పమని, వాటిని కూడా హార్బర్ అభివృద్ధికే ఉపయోగిస్తామని పోర్టు యాజమాన్యం చెబుతోంది. కొందరైతే ఏళ్ల తరబడి ఫీజులు కట్టడం లేదని, బకాయిలన్నీ కట్టాల్సిందేనని స్పష్టంచేసింది. బకాయి ఉన్న బోట్లకు లైసెన్స్ రెన్యువల్ చేయవద్దని రాష్ట్ర మత్స్య శాఖ అధికారులకు సూచించింది. దాంతో ఈ ఏడాది చాలా బోట్లకు లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దాంతో వారికి రాయితీ డీజిల్ లభించడం లేదు. పోర్టుకు ఫీజులు బకాయి ఉన్నవారు అక్కడ వాటిని చెల్లించి, ఆ రశీదులు తెస్తేనే రెన్యువల్ చేస్తామని మత్స్య శాఖ అధికారులు స్పష్టం చేయడంతో వాటిని తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై మత్స్యకార సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫీజుల భారం మోయలేమని, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 50 శాతం మాత్రమే కడతామని చెబుతున్నాయి. అలాగే కరోనా సమయంలో అన్ని వర్గాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చాయని, తమకు మాత్రం ఏమీ ఇవ్వలేదని, ఆ కాలానికి చార్జీలు వసూలు చేయకూడదని కోరుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇరువర్గాల మధ్య సరైన విధానంలో చర్చలు జరగడం లేదు. దాంతో మత్స్యకార నాయకులు రెండు రోజుల క్రితం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పోర్టు యాజమాన్యాన్ని ఒప్పించాలని కోరారు.
చార్జీలు ఎలా పెంచారంటే...?
హార్బర్ (జెట్టీ)లో మత్స్యకారులు ఎవరైనా బోట్లను లంగరు వేసుకుంటే...వారు నెలకు గతంలో బెర్తు హైర్ చార్జీ కింద రూ.390 చెల్లించేవారు. మే 25వ తేదీ నుంచి పోర్టు యాజమాన్యం ఈ చార్జీలను రూ.610కి పెంచింది. ఒక బోటు రెండు వారాల వాయేజ్‌కి వెళితే...సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెడుతోంది. నెలకు రూ.10 లక్షలు పెట్టుబడి. ఆ క్రమంలో జెట్టీని ఉపయోగించుకుంటే నెలకు పోర్టుకు రూ.610 చెల్లించాలి. అది ఎక్కువ అని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దానిని ఇంతకు ముందులాగే రూ.390 చొప్పునే వసూలు చేయాలని కోరుతున్నారు.
రిపేర్ల సమయంలో వారానికి రూ.394
బోట్లకు మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు వాటిని స్లిప్‌వే వద్దకు తీసుకువచ్చి పనులు చేసుకుంటారు. అలాంటి సమయంలో బోటుకు వారానికి రూ.394 ల్యాండింగ్ చార్జీలుగా చెల్లించాలని పోర్టు యాజమాన్యం ఇటీవల నోటీసు జారీ చేసింది. ఇవి కూడా అధికమని, అంత చెల్లించలేమని మత్స్యకార సంఘాలు చెబుతున్నాయి.
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలి
వాసుపల్లి జానకీరామ్,
అధ్యక్షులు, ఏపీ మెకనైజ్డ్ బోటు ఆపరేటర్ల సంఘం
కరోనా సమయంలో వేట లేకపోవడం వల్ల చార్జీలు కట్టలేకపోయాం. ఆ కాలానికి చార్జీలు రద్దు చేయాలి. అది కాకుండా మిగిలిన కాలానికి ఎవరైనా బకాయి వుంటే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 50 శాతం కట్టించుకొని బోటు రెన్యువల్‌కు అనుమతి ఇవ్వాలఇ. పెంచిన చార్జీలను తగ్గించి పూర్వపు ప్రకారమే వసూలు చేయాలి.