ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఉత్తరాంధ్ర!?
ABN , First Publish Date - 2023-11-24T02:01:09+05:30 IST
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ దృష్టి పెట్టారని, అందుకే విశాఖను పరిపాలనా రాజధాని చేశారని వైసీపీ నాయకులు చెబుతుంటారు.
నాలుగున్నరేళ్లుగా లేని ప్రేమ ఇప్పుడే ఎందుకో పుట్టుకువచ్చిందో...
ఈ ప్రాంత అభివృద్ధిపై ఇప్పటివరకూ ఎన్నడూ సమీక్షలు లేవు...ఆదేశాలు లేవు
ఇప్పుడు ప్రగతి కోసం, విభజన చట్టం అమలు కోసం సీఎం విశాఖలో ఉంటారంటూ జీవో
అందుకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు
ఈ ఆరు నెలలకు కార్యాలయాలు, అధికారులకు నివాసాలు అవసరమా?
వైసీపీ ప్రభుత్వ ఉత్తర్వులపై విశాఖ వాసుల పెదవివిరుపు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?
సమీక్షలకు ప్రతి శాఖకు కార్యాలయం అవసరమా?
ఒకరోజు ఉండి వెళ్లిపోయేవారికి నివాసాలా?
వీటన్నింటికీ ప్రత్యేక భవనాలు, వాటికి ఉత్తర్వులా..?
ఏమిటీ డ్రామా?, ఎన్నికల స్టంట్ కాకపోతే మరేంటి?
...ఇదీ ప్రస్తుతం విశాఖపట్నంలో అనేక మంది నుంచి వినిపిస్తున్న మాట.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ దృష్టి పెట్టారని, అందుకే విశాఖను పరిపాలనా రాజధాని చేశారని వైసీపీ నాయకులు చెబుతుంటారు. అయితే ఇది చట్టపరంగా చెల్లుబాటు కాలేదు. వివాదాలు న్యాయస్థానంలో ఉన్నాయి. అవి ఇప్పుడే తేలేలా లేవని ‘సీఎం క్యాంపు కార్యాలయం’ అంటూ కొత్త నాటకానికి తెర లేపారు. రుషికొండపై పర్యాటక శాఖ భవనాలు అంటూ సీఎం కోసం కార్యాలయం నిర్మించారు. సీఎం విశాఖ రావడానికి అనేక ముహూర్తాలు పెట్టారు. ఉగాది, జూలై, దసరా వెళ్లిపోయాయి. ఇక మిగిలింది డిసెంబరు. అది కూడా దగ్గరకు వస్తుండడంతో బుధవారం ప్రభుత్వం ఓ జీఓ జారీచేసింది. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం, విభజన చట్టం అమలు కోసం సీఎం విశాఖలో ఉంటారని, ఆయన రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇప్పటికే 35 శాఖల్లో 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాలు ఎంపిక చేశామని, మిగిలిన వాటికి తగిన వసతి చూడాలని అందులో పేర్కొన్నారు. అధికారులకు కార్యాలయాలు, వారు రాత్రిపూట బస చేయడానికి వసతి చూడాలని సూచించారు.
సమీక్షలకు వసతి ఎందుకు?
నిజంగా సీఎం జగన్‌కు ఉత్తరాంధ్రాపై అభివృద్ధి ఉంటే.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కనాడైనా ఇక్కడ కీలక శాఖ అధికారులతో సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదో కార్యక్రమం ఉంటే ఆయన వచ్చి వెళ్లడం తప్ప...అభివృద్ధి కోణంలో అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవని, కనీసం సెక్రటరీల స్థాయి అధికారులను కూడా పంపించి ఇక్కడ సమీక్షలు నిర్వహించలేదని గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇప్పడు మొత్తం 35 శాఖలను తీసుకొచ్చి సమీక్షించి, ఈ ఆరు నెలల్లో ఏమి చేస్తారని అడుగుతున్నారు. అదేవిధంగా సమీక్ష సమావేశాల వరకే అయినట్టయితే...ప్రతి శాఖకు కార్యాలయం, ఆయా అధికారులు ఉండడానికి వసతి దేనికని ప్రశ్నిస్తున్నారు. ఏవైనా సదస్సులు జరిగినప్పుడు అధికారులు, మంత్రులు వస్తే గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో ఉంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఫలానా భవనం, ఫలానా కార్యాలయం అంటూ కేటాయించాల్సిన అవసరం ఏముందనే భావన పలువురు వ్యక్తంచేస్తున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి విశాఖలో అనేక వ్యవహారాలు చూస్తున్నందున ఆమె పలుసార్లు వచ్చి వీఎంఆర్‌డీఏలో సమావేశాలు పెట్టి వెళ్లిపోయేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల నేవీ సమీక్షకు వచ్చినప్పుడు వీఎంఆర్‌డీఏలో ఒక సమావేశం పెట్టి వెళ్లిపోయారు. ఐటీ సెక్రటరీ కోన శశిధర్ ఐటీ సదస్సుకు వచ్చి సంబంధిత అధికారులతో అక్కడే మాట్లాడి వెళ్లారు. ఇలాంటి సమీక్షలకు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీసులు, వారు ఉండడానికి వసతి అంటూ ప్రచారం చేసుకోవడం ఎన్నికల డ్రామా కాకపోతే మరేమిటి?...అని పలువురు ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు.
ఆస్పత్రిలో అధికారులకు వసతి..?
- విమ్స్‌లో 20 వరకు ప్రత్యేక రూములు ఉన్నాయి. వాటిని అధికారుల వసతికి ఉపయోగించాలని ప్రభుత్వం బుధవారం ఇచ్చిన జీఓలో సూచించింది. సమీక్షకు వచ్చే అధికారులు రాత్రికి ఇక్కడే ఉంటే హోటల్‌లో ఉంటారు గాని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి...అక్కడి రూములో ఉంటారా? ఇది జరిగే పనేనా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- అప్పుఘర్ వద్ద పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ (అప్పుఘర్)లో 27 గదులను అధికారుల వసతికి కేటాయించారు.
- బీచ్ రోడ్డులోని అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌లో నాలుగు గదులు సమకూర్చారు.
- కైలాసగిరి కిందన పంచాయతీరాజ్ అతిథిగృహం మరమ్మతుల్లో ఉంది. అందులో కూడా ఆరు రూములు కేటాయించారు.
మిలీనియం టవర్ ఎవరికి?
రుషికొండలో హిల్ నంబరు 3పై ఏపీఐఐసీ మిలీనియం టవర్లు ఏ, బీ నిర్మించింది. వాటిని ఐటీ కంపెనీల కోసం నిర్మించారు. రాజధాని పేరుతో నాలుగున్నేరేళ్లుగా ఖాళీగా ఉంచారు. సొంత భవనాలు లేని ముఖ్య శాఖలకు అందులో వసతి కల్పించాలని తాజా ఉత్తర్వులో సూచించారు. ఫలానా అని సూచించలేదు. ఎవరు ఉపయోగించుకుంటారో మరి.
సీఎం జిల్లాలకు వెళతారట!!
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న సీఎం జగన్ ఇక్కడికి వచ్చి సమీక్షలు నిర్వహించడంతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులను తీసుకొని జిల్లాల పర్యటనకు వెళతారని కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం జగన్ శంకుస్థాపనలకు తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాలకు వచ్చిన సందర్భం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉందని విశాఖలో కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.