కాటేసిన కల్తీ మద్యం

ABN , First Publish Date - 2023-08-22T01:37:22+05:30 IST

కల్తీ మద్యం ముగ్గురు వలస కార్మికులను కాటేసింది.

కాటేసిన కల్తీ మద్యం

ముగ్గురు వలస కార్మికులు మృతి

అచ్యుతాపురం సెజ్‌లో పనిచేసేందుకు ఒడిశా నుంచి రాక

వచ్చిన రోజే మందు తాగిన వైనం

మరుసటి రోజు వాంతులు, రక్తపు విరేచనాలు

మృతిచెందిన విషయాన్ని గుట్టుగా ఉంచిన కాంట్రాక్టర్‌

ఒడిశా వైద్య శాఖకు సమాచారం

ఇక్కడ అధికారులను అప్రమత్తం చేసిన వైనం

వైద్యుల బృందం పరిశీలన

కల్తీ మద్యం లేదా కల్తీ ఆహారం కారణమై ఉండవచ్చునంటున్న డీఎంహెచ్‌వో

అచ్యుతాపురం, ఆగస్టు 21:

కల్తీ మద్యం ముగ్గురు వలస కార్మికులను కాటేసింది. ఈ విషయం వెలుగుచూడకుండా కప్పి పెట్టేందుకు స్థానిక కాంట్రాక్టర్‌ యత్నించాడు. అయితే ఒడిశా వైద్య శాఖ అధికారులు అందించిన సమాచారంతో జిల్లా వైద్య శాఖ అధికారుల విచారణ చేపట్టడంతో బయటపడింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

అచ్యుతాపురం సెజ్‌లో గల కర్మాగారాల్లో పనిచేసేందుకు ఒడిశా, జార్ఖండ్‌ , బిహార్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారిని కాంట్రాక్టర్లు తీసుకువస్తుంటారు. ఆ విధంగా ఈనెల 15వ తేదీన ఒడిశా నుంచి కొందరు కూలీలు దుప్పితూరు వచ్చారు. ఆ రోజు రాత్రి వీరిలో కొందరు మద్యాన్ని సేవించారు. అందులో కోరాపుట్‌ జిల్లా దశమంతపూర్‌ మండలం ముర్‌కర్‌ గ్రామానికి చెందిన జాగా మినియక్‌ (45) మరుసటి రోజు ఉదయం ఒక కర్మాగారంలో పనికి వెళ్లాడు. వాంతులు, విరేచనాలు కావడంతో తిరిగి వచ్చేశాడు. కాంట్రాక్టర్‌ ఇచ్చిన మందులు వేసుకొని పడుకున్నాడు. సాయంత్రం తోటి కూలీలు వచ్చేసరికి..అచేతనంగా వున్న జాగా మినియక్‌ను అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించారు. అలాగే అతనితో సహా మద్యం సేవించిన బొలంగీర్‌ జిల్లా టిట్లాఘర్‌ మండలం సింగర ముండ గ్రామానికి చెందిన సురేందర్‌ కార్సెల్‌ (38), నవరంగపూర్‌ జిల్లా చిట్టబేడ మండలం చలన్‌గూడ గ్రామానికి చెందిన పద్మన్‌ సాంత (26) కూడా పదహారో తేదీన వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో కాంట్రాక్టర్‌ అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం వీరిని అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు పంపారు. అయితే సురేందర్‌ కేజీహెచ్‌ నుంచి ఎవరికీ చెప్పకుండా ఇతర మిత్రులతో కలిసి అలెప్పీ-ధన్‌బాద్‌ రైలులో తమ స్వస్థలానికి బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయాడు. పద్మన్‌ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈనెల 19వ తేదీ ఉదయం మరణించాడు. ఈ విషయం ఒడిశా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడంతో అక్కడి వైద్య శాఖ అధికారులు ఏపీ వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో డీఎంహెచ్‌వో వెంటనే స్పందించి అచ్యుతాపురం వైద్యుల బృందాన్ని దుప్పితూరుకు పంపించారు. అక్కడ పరిస్థితులు, ఏమి జరిగిందో వివరాలను బృందం సేకరించింది. కల్తీ మద్యం సేవించడం వల్లే వీరు చనిపోయినట్టు బృందం నివేదిక ఇచ్చింది. దుప్పితూరులో షెడ్ల చుట్టూ మురికి కూపంగా ఉండడంతో బ్లీచింగ్‌ చల్లి శుభ్రం చేయించారు. అలాగే నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

డీఎంహెచ్‌వో వివరణ

ముగ్గురు మృతిచెందిన విషయాన్ని అనకాపల్లి డీఎంహెచ్‌వో హేమంత్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రస్తావించగా కల్తీ మద్యంగానీ, కల్తీ ఆహారంగానీ తీసుకోవడం వల్లే వలస కార్మికులు మృతి చెందారన్నారు. పోస్టుమార్టంలో విషయం తేలుతుందన్నారు.

Updated Date - 2023-08-22T01:37:22+05:30 IST