వేతన పెంపులో వివక్ష

ABN , First Publish Date - 2023-06-03T01:23:44+05:30 IST

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న 30 కేటగిరీల ఉద్యోగులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం...మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ను మాత్రం విస్మరించింది.

వేతన పెంపులో వివక్ష

ప్రభుత్వం తీరుపై మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ ఆవేదన

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పనిచేసే 30 కేటగిరీల ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంపు

హెల్త్‌ ప్రొవైడర్స్‌ను విస్మరించిన పాలకులు

రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది..జోన్‌-1 పరిధిలో మూడు వేల మంది

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న 30 కేటగిరీల ఉద్యోగులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం...మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ను మాత్రం విస్మరించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్ల పరిధిలో సుమారు పది వేల మంది మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు పనిచేస్తున్నారు. జోన్‌-1 పరిధిలోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు మూడు వేల మంది ఉన్నారు. ఇటీవల పెంచిన గౌరవ వేతనాలు తమకు వర్తింపజేయకపోవడం పట్ల వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కనీసం నెలకు పది వేల నుంచి పదిహేను వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

ఎన్‌హెచ్‌ఎంలో పనిచేసే ఏఎన్‌ఎం, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సులకు 42 శాతం నుంచి 43 శాతం వరకూ వేతనం పెరిగింది. అలాగే వైద్యులు, కన్సల్టెంట్‌లు, ఎస్‌ఎన్‌సీయూ డేటా మేనేజర్‌, జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్లు, అకౌంట్‌ అసిస్టెంట్లు, రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌లు, అటెండెంట్‌ క్లీనర్‌, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, డేటా అసిస్టెంట్‌, ఇతర కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు 22 శాతం నుంచి 23 శాతం వరకు వేతనాలు పెరిగాయి. అయితే, ఈ ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్న మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏఎన్‌ఎం కంటే తక్కువ వేతనం

ప్రస్తుతం మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌కు రూ.25 వేల వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఈ పథకంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేతనాలు చెల్లిస్తాయి. రాష్ట్రం 60 శాతం, కేంద్రం 40 శాతం చొప్పున ఇస్తాయి. 2018లో చివరిసారిగా వీరికి వేతనాలను పెంచారు. కొద్దిరోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళన చేయడంతో ఎట్టకేలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే మిగిలిన కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం..తమను ఎందుకు విస్మరించిందో అర్థం కావడం లేదని మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ వాపోతున్నారు. ఈ పథకంలో పనిచేసే ఏఎన్‌ఎంలకు ప్రస్తుతం రూ.19 వేలు ఇస్తుండగా...రూ.27 వేలు చేశారని, స్టాఫ్‌ నర్సుకు పెరిగిన వేతనాలతో రూ.35,500 వస్తుందని తెలిపారు. అందరికీ పెరిగాయని, తాము అదే రూ.25 వేలకు పనిచేయాల్సిన పరిస్థితిని ఎందుకు కల్పించారో అర్థం కావడం లేదని వారంతా వాపోతున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-06-03T01:23:44+05:30 IST