విశాఖ బీచ్‌లో విధ్వంసం!
ABN , First Publish Date - 2023-01-27T03:27:38+05:30 IST
విశాఖపట్నం వేదికగా మార్చిలో జరగబోయే జీ-20 సదస్సు పేరు చెప్పి జీవీఎంసీ అధికారులు బీచ్‌లో విధ్వంసానికి పాల్పడుతున్నారు.
తీరం పొడవునా ఉన్న మార్నింగ్ గ్లోరీ తీగల తొలగింపు
జీ20 ప్రతినిధులను ఆకట్టుకొనేందుకే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం వేదికగా మార్చిలో జరగబోయే జీ-20 సదస్సు పేరు చెప్పి జీవీఎంసీ అధికారులు బీచ్‌లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. సదస్సుకు వచ్చే అతిథులను ఆకట్టుకునేందుకంటూ సహజ సిద్ధంగా ఏర్పడిన బీచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై అల్లుకుని ఉండే ‘మార్నింగ్ గ్లోరీ’ తీగలను యంత్రాలతో పూర్తిగా తొలగించేస్తున్నారు. దీనివల్ల బీచ్‌లో జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు తీరం కోతకు గురవుతుందని పర్యావరణ పరిశోధకులు, వృక్షశాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరం వెంబడి ఇసుక తెన్నెలపై మార్నింగ్ గ్లోరీ రకానికి చెందిన తీగలు పచ్చని దుప్పటి కప్పినట్టు పరుచుకుని ఉంటాయి. గుర్రపు పాదాల ఆకారంలో ఉండే వీటిని ‘హార్స్ షూ సేపర్స్’ అని, ఇసుక గాలికి కోతకు గురవకుండా అడ్డుకుంటాయని ‘శాండ్ బైండర్స్’ అని కూడా పిలుస్తుంటారు. తీరానికి వచ్చే భారీ కెరటాలు, సముద్రం మీదుగా వీచే తీవ్రమైన గాలులకు ఒడ్డున ఉండే ఇసుక కోతకు గురై గాల్లోకి ఎగురుతుంది. దీనివల్ల బీచ్ స్వరూపం దెబ్బతినడంతోపాటు ఇసుక రేణువులు ఎగరడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అయితే తీరంలో ఇసుకపై పచ్చని తివాచీ మాదిరిగా విస్తరించి ఉండే ‘మార్నింగ్ గ్లోరీ’ తీగలు కెరటాలు వచ్చినప్పుడు ఇసుక సముద్రంలోకి వెళ్లకుండా, సముద్రం మీదుగా వచ్చే గాలులకు కోతకు గురవ్వకుండా అడ్డుకుంటూ సహజ సిద్ధమైన రక్షణ కల్పిస్తున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకూ తీరం పొడవునా ఈ తీగలు విస్తరించి ఉన్నాయి. ఇవి సూర్యరశ్మిని అడ్డుకుని తీరంలో ఇసుక చాలాసేపు తడిగా ఉండేలా కాపాడుతుంటాయి. ఈ వాతావరణం ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లు పిల్లలుగా మారడానికి అనువుగా ఉంటుంది. సాధారణంగా తాబేలు గుడ్డు పెట్టిన 60 రోజులకు పిల్లగా మారుతుంది. గుడ్డుపై పడే సూర్యరశ్మి స్థాయిని బట్టి లింగ నిర్ధారణ జరుగుతుంది. సూర్యరశ్మి ఎక్కువగా తగిలితే ఆ గుడ్డు నుంచి ఆడపిల్ల బయటకు వస్తుంది. అదే తక్కువ స్థాయిలో తగిలితే మగపిల్ల బయటకు వస్తుంది. తీరంలో ‘మార్నింగ్ గ్లోరీ’ తీగలు ఉండడం వల్ల కొన్ని గుడ్లకు తక్కువగా, మరికొన్నింటికి ఎక్కువగా సూర్యరశ్మి తాకడం తాబేలు పిల్లల ఉత్పత్తికి కారణంగా మారుతోంది. వీటికితోడు తీగల కింద చెమ్మదనం మాటున కొన్ని రకాల సూక్ష్మజీవులు జీవనం సాగిస్తుంటాయి. వాటిని ఆహారంగా తినేందుకు పెద్దఎత్తున పక్షులు తీరంలో చేరడం వల్ల జీవవైవిధ్యం ఏర్పడుతుంది. కానీ జీవీఎంసీ అధికారులు గత మూడు రోజులుగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకూ ప్రధానమైన ప్రాంతాల్లో యంత్రాలను దింపి ‘మార్నింగ్ గ్లోరీ’ తీగలను తొలగించేస్తున్నారు. అంతేకాకుండా తీరంలో ఎత్తుపల్లాలు ఉన్నచోట చదును చేస్తున్నారు. బీచ్‌లో ఇసుకను తవ్వి మరొకచోట వేస్తున్నారు. ఇది సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పట్టించుకోకుండా తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. బీచ్‌లో ‘మార్నింగ్ గ్లోరీ’ తీగలను తొలగించడం జీవవైవిధ్యానికి పెనుముప్పేనని ఏయూ పర్యావరణశాస్త్ర విభాగం విశ్రాంత ప్రొఫెసర్ సీఎస్ రాజశేఖర్ పేర్కొన్నారు.