బాబోయ్‌ డెంగ్యూ

ABN , First Publish Date - 2023-09-22T01:25:12+05:30 IST

నగరంలో డెంగ్యూ విజృంభిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం, దీనికితోడు అడపాదడపా వర్షాలు కురుస్తుండడం...డెంగ్యూ కారక దోమల వ్యాప్తికి అనుకూలంగా మారింది.

బాబోయ్‌ డెంగ్యూ

గత ఏడాది సెప్టెంబరు 20 నాటికి నమోదైన కేసులు 520

ఈ ఏడాది సెప్టెంబరు 20 నాటికి నమోదైన కేసులు దాదాపు 632

-------------------------------

నగరంలో పెరుగుతున్న కేసులు

పారిశుధ్య లోపంతో వ్యాప్తి చెందుతున్న దోమలు

నియంత్రణలో జీవీఎంసీ నిర్లక్ష్యం

కేజీహెచ్‌కు పెరుగుతున్న జ్వరపీడితుల తాకిడి

నిండిపోయిన రాజేంద్రప్రసాద్‌వార్డు

పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి చికిత్స కోసం ఏఎంసీయూలో ప్రత్యేక ఏర్పాట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో డెంగ్యూ విజృంభిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం, దీనికితోడు అడపాదడపా వర్షాలు కురుస్తుండడం...డెంగ్యూ కారక దోమల వ్యాప్తికి అనుకూలంగా మారింది. జ్వర బాధితులతో కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్‌ వార్డు నిండిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదితో పోల్చితే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవ్వడం జీవీఎంసీ వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

నగరంలో ప్రతి పది, పదిహేను ఇళ్లకు సగటున ఒకరు చొప్పున జ్వరపీడితులు ఉంటున్నారని జిల్లా మలేరియా విభాగం సిబ్బంది చెబుతున్నారు. పారిశుధ్య నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారడం, వర్షాకాలంలో దోమల వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీవీఎంసీ విఫలమవ్వడం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. పారిశుధ్య నిర్వహణపై ప్రజారోగ్య విభాగం అధికారులు పట్టు కోల్పోయారు. కార్యాలయాల్లో కూర్చొని కాన్ఫరెన్స్‌ల పేరుతో కాలం గడిపేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. దీనివల్ల పారిశుధ్య నిర్వహణలో లోపాలను గుర్తించడం, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయడం వంటి చర్యలపై దృష్టిపెట్టలేకపోతున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన వెంట తిరుగుతూ ఏదో కష్టపడిపోతున్నట్టు హడావుడి చేస్తున్నారు. ఇక ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకుగాను ప్రారంభించిన వాహనాలు సక్రమంగా పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రెండు రోజులకు ఒకసారి మాత్రమే రోడ్డుపైకి వస్తున్నాయి. క్లాప్‌ వాహనాలు వీధుల్లోకి రాకపోవడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను రోడ్డుపైకి తెచ్చి పడేస్తున్నారు. రోజుల తరబడి చెత్తకుప్పలు అలాగే ఉండిపోవడంతో పారిశుధ్య లోపం తలెత్తుతోంది. ఇదే సమయంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో నీరు చెత్తకుప్పల్లోని ప్లాస్టిక్‌ కవర్లు, కొబ్బరి బొండాలు, వాటర్‌బాటిళ్లు వంటి వాటిల్లో నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇక దోమల నివారణకు ఫాగింగ్‌, యాంటీలార్వా ఆపరేషన్లు వంటివి సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.

ఏటా వర్షాకాలంలో జీవీఎంసీ అధికారులు దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేసేవారు. మూడు నెలలపాటు పనిచేలా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. మలేరియా విభాగం సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్‌ఎంలతో కలిసి తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి దోమల లార్వాలు పెరిగే ప్రాంతాలను గుర్తింపు, లార్వా నిర్వీర్యం, వారంలో ఒకరోజు డ్రై డేపాటించడం వంటి వాటిపై అవగాహన కల్పించేవారు. ఇంట్లో ఎవరైనా జ్వరంతో భాదపడుతున్నట్టయితే మలేరియా విభాగం సిబ్బంది రక్తపరీక్షలు చేసేవారు. కానీ ఈ ఏడాది జ్వరాల సీజన్‌పై జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయం గురించి జీవీఎంసీ ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారి వద్ద ప్రస్తావించగా డెంగ్యూ కేసుల వివరాలపైనా, నగరంలో పరిస్థితిపైనా స్పందించేందుకు నిరాకరించడం విశేషం.

పెరుగుతున్న కేసులు:

నగరంలో డెంగ్యూ కేసులు గత మూడు నెలలుగా భారీగా పెరుగుతున్నాయి. అధికారికంగా గత ఏడాది సెప్టెంబరు 20వ తేదీ నాటికి 520 డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈ ఏడాది సెప్టెంబరు 20 నాటికి 632 కేసులు నమోదైనట్టు మలేరియా విభాగం సిబ్బందే చెబుతున్నారు. ఈ ఏడాది గత మూడు నెలల్లోనే దాదాపు 450 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో మళ్లీ అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో దోమల వ్యాప్తి, దాంతోపాటు డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. కేజీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌ వార్డు జ్వరపీడితులతో నిండిపోయింది. డెంగ్యూ, వైరల్‌ జ్వరాలతో వచ్చేవారి సంఖ్యపెరుగుతోందని, ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వైద్యం అందజేసేందుకు వీలుగా భవనగర్‌ వార్డులోని ఏఎంసీయూలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కేజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణ గురువారం మీడియాకు వివరించారు.

Updated Date - 2023-09-22T01:25:12+05:30 IST