వైసీపీపై పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత

ABN , First Publish Date - 2023-03-19T01:28:26+05:30 IST

‘సంక్షేమ పథకాల పేరుతో ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో రూ.పది వేలు వేసేస్తే ప్రజలు ఓట్లేసేస్తారా?..

వైసీపీపై పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత

నాలుగేళ్లలో ఏం చేశారు?...అన్ని వర్గాల్లోనూ అదే ప్రశ్న

బటన్‌ నొక్కేస్తే...ఓట్లు పడిపోతాయా?

అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు

నాలుగేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ అయినా ఏర్పాటుచేశారా?

పిల్లలు ఉద్యోగాల్లేక ఖాళీగా తిరుగుతున్నారు

నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలం

ఒకచేత్తో డబ్బులిచ్చి...మరోచేత్తో రెండింతలు లాగేస్తున్నారు

ప్రభుత్వ, వివాదాస్పద భూములు కొల్లగొడుతున్నారు

ఒకప్పుడు విశాఖలో ఐటీ రంగం కళకళలాడింది...ఇప్పుడేముంది రుషికొండలో

ఒక్కో కొండకు గుండు కొడుతున్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వివిధ వర్గాల అభిప్రాయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘సంక్షేమ పథకాల పేరుతో ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో రూ.పది వేలు వేసేస్తే ప్రజలు ఓట్లేసేస్తారా?...ఒకచేత్తో ఇచ్చినట్టే ఇచ్చి...మరో చేత్తో అంతకు రెండింతలు లాగేసుకుంటున్నారు...పిల్లలు చదువులు పూర్తిచేసినా ఉద్యోగాల్లేక ఇంట్లో తిరుగుతుంటే కడుపు మండిపోతోంది... నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదు...నేతలు వాళ్ల ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వ, వివాదంలో వున్న భూములను బెదిరించి లాగేసుకుంటున్నారు. ఇలాంటి వారిని అధికారంలో కొనసాగిస్తే ఉంటున్న ఇల్లును కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చూపించారు...’ ఇదీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీ ఓటమిపై నగరంలోని వివిధ వర్గాల విశ్లేషణ...

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తమదేనని వైసీపీ నేతలు మొదటి నుంచి ధీమా వ్యక్తంచేస్తూ వచ్చారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్రలో తమకు తిరుగుండదనే భ్రమలో ఉన్నారు. అధికారంలో వున్నందున తమకు వ్యతిరేకంగా ఓట్లేస్తే ఇబ్బందులు తప్పవనే సంకేతాలను అధికారులతో పరోక్షంగా ఇప్పించారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కడా రాజీ పడలేదు. దీంతో ఎలాగైనా విజయం తమదేనని వైసీపీ నేతలు భావించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌ అని, విశాఖ రాజధాని ప్రకటనపై రెఫరెండం అంటూ ప్రకటనలు ఇచ్చారు. తీరా చూస్తే సీన్‌ మారిపోయింది. ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌ నుంచే టీడీపీ ఆధిపత్యం కనిపించింది. రౌండ్‌ రౌండ్‌కు తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిపత్యం కొండలా పెరిగిపోవడంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. చివరకు టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై సుమారు 35 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇరు పార్టీలకు లభించిన ఓట్ల మధ్య వ్యత్యాసం చూస్తే పదిహేను శాతానికి పైగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో అసలు ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయం ఉంది, తాజా ఎమ్మెల్సీ ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తున్నారో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివిధ వర్గాలను ఆరా తీయగా వారి మనోభావాన్ని స్పష్టంగా బయటపెట్టారు.

వైసీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లవుతోంది. ఈ కాలంలో రాష్ట్రంలో ఒక్కటైనా కొత్త పరిశ్రమను ఏర్పాటుచేశారా?, యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ?...పలువురు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం రూపంలో వ్యక్తమైందని ఏయూలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అన్నారు. తన కుమారుడు పీజీ పూర్తిచేసి మూడేళ్లు అయిందని, ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరక్కపోవడంతో హైదరాబాద్‌ వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతసేపూ ఏయూలో చెట్లను నరికేయడం, అందమైన రుషికొండను తవ్వేసి సొంతానికి గెస్ట్‌హౌస్‌ కట్టుకోవడం వల్ల ప్రజలకు ఒనగూరేదేమిటని ప్రశ్నించారు. జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు కొందరు మధ్యాహ్నం భోజన సమయంలో ఎమ్మెల్సీ ఫలితంపై చర్చించుకుంటూ కనిపించారు. నగరంలో ఐటీ రంగం ఒకప్పుడు కళకళలాడేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రుషికొండలో ఏముందని?...ఒకరు ప్రశ్నించగా, మరొక మహిళా ఉద్యోగి స్పందిస్తూ అక్కడున్న ఒక్కో కొండకు బోడిగుండు కొట్టిస్తున్నారుగా?..అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. మద్దిలపాలెంలో టిఫిన్‌ దుకాణం నిర్వహించే యువకుడు మాట్లాడుతూ నాలుగేళ్లలో వాళ్లు చేసిన దందాలు, బెదిరింపులు, కబ్జాల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిబింబించిందని అభిప్రాయపడ్డాడు. ద్వారకా నగర్‌లోని ఆటోస్టాండ్‌ వద్ద ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఆరా తీయగా...వాహనమిత్ర పేరుతో రూ.పది వేలు ఇచ్చి రోడ్‌ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్‌ ఫీజులు పెంచడంతోపాటు రకరకాల కేసుల పేరుతో అంతకు రెండు,మూడింతలు తమ వద ్ద నుంచి లాగేసుకుంటున్నారని వాపోయారు. సీతమ్మధార ప్రాంతంలో నివసించే మధ్య తరగతి కుటుంబానికి చెందిన గృహిణి అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయని ఆరోపించారు. రూ.70 వుండే వంటనూనె ఇప్పుడు రూ.160కి పెరిగితే రాష్ట్రప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మరో యువకుడు మాట్లాడుతూ పరిశ్రమలు వస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కొత్తగా రాకపోగా, ఉన్నవాటిని మూసేస్తుంటే తమ భవిష్యత్తు, తమపై ఆశలు పెట్టుకున్న కుటుంబసభ్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. నగరంలో విలువైన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి నయానో...భయానో వారి నుంచి లాగేసుకుంటున్నారని దీనివల్ల ప్రజలు బాగుపడకపోయినా, ఆ భూముల్లో వ్యాపారాలు చేసి వాళ్లు మాత్రం భారీగా ఆస్తులు పెంచుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుడు ఒకరు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేర్లతో బటన్‌ నొక్కి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వేయడం, దీన్ని సొంత జేబు నుంచి ఇస్తున్నట్టు సొంతడబ్బా కొట్టుకోవడం తప్ప, రాష్ట్ర అభివృద్ధికి శాశ్వతంగా ఉపయోగపడే ఒక ప్రాజెక్టును గానీ, పరిశ్రమను గానీ ఏర్పాటుచేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేయకపోవడం వల్లే నాలుగేళ్లకే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వుందనే విషయం తమకు తెలిసినప్పటికీ అధిష్ఠానానికి చెబితే తమను ఎక్కడ దూరం పెట్టేస్తారోననే భయంతో ఆ సాహసం చేయలేదని వైసీపీలోని కొంతమంది నేతలు, ద్వితీయశ్రేణి నేతలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

Updated Date - 2023-03-19T01:28:26+05:30 IST