ఆర్‌సీఎల్ కర్మాగారంలో కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2023-04-03T23:53:10+05:30 IST
సెజ్‌లోని ఆర్‌సీఎల్ కర్మాగారంలో సోమవారం పూడిమడకకు చెందిన ఓ మత్స్యకార కార్మికుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు, పూడికమడక మత్స్యకారులు ఆందోళనకు దిగారు.
న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు, మత్స్యకారుల ఆందోళన
అచ్యుతాపురం, ఏప్రిల్ 3: సెజ్‌లోని ఆర్‌సీఎల్ కర్మాగారంలో సోమవారం పూడిమడకకు చెందిన ఓ మత్స్యకార కార్మికుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు, పూడికమడక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. పూడిమడకకు చెందిన కొవిరి పెంటయ్య(40) ఏడాది నుంచి మెకానికల్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం కర్మాగారంలో ప్రమాదం జరిగి మృతి చెందాడు. అయితే పెంటయ్య విధుల్లో ఉండగా క్రేన్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయని, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని కర్మాగారం ప్రతినిధులు చెప్పారు. అయితే కర్మాగారంలోనే పెంటయ్య మృతి చెందాడని, మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కి తీసుకువెళ్లి అక్కడ మృతిచెందినట్టు చెబుతున్నారని, పెంటయ్య మృతికి అసలు కారణాలు తెలియజేయాలని మత్స్యకారులు పట్టుబట్టారు. కాగా పెంటయ్య మృతదేహాన్ని చూడడానికి విశాఖ కేజీహెచ్‌కి వెళ్లిన కొందరు మత్స్యకారులు మృదేహం ఫొటోలను తోటి మత్స్యకారులకు పంపారు. మర్మాంగం వద్ద కాలిపోయినట్టు ఫొటోల్లో ఉండడంతో మత్స్యకారులు ఆవేశానికి గురై అసలు కారణాలు తెలపాలంటూ కర్మాగారం వద్ద నినాదాలు చేశారు. కర్మాగారం ప్రతినిధులు స్పందించకపోవడంతో మత్స్యకారులు గేట్లు దూకి కర్మాగారంలోకి ప్రవేశించారు. పోలీసులు అదుపుచేయడంతో గేటు ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిడి అప్పారావు, వాసుపల్లి శ్రీను, ఉమ్మిడి జగన్, సూరాడ ధనరాజ్, గంగిరి రవి తదితరులు పాల్గొన్నారు.