Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:29 AM

జిల్లాలో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో పోటెత్తాయి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వందలాదిగా శుక్రవారం రాత్రికే పాడేరుకు చేరుకున్నారు. శనివారం వేకువజాము 4 గంటల సమయంలో వంజంగి మేఘాల కొండకు తరలివెళ్లారు. అక్కడ మంచు అందాలను ఆస్వాదించారు.

పర్యాటకుల సందడి
చాపరాయి వద్ద పర్యాటకులు

పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిట

బొర్రాగుహలు, లంబసింగి, అరకు, చాపరాయి వద్ద రద్దీ

పాడేరురూరల్‌, డిసెంబరు 30: జిల్లాలో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో పోటెత్తాయి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వందలాదిగా శుక్రవారం రాత్రికే పాడేరుకు చేరుకున్నారు. శనివారం వేకువజాము 4 గంటల సమయంలో వంజంగి మేఘాల కొండకు తరలివెళ్లారు. అక్కడ మంచు అందాలను ఆస్వాదించారు.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో వేకువజాము ఐదు గంటల నుంచే లంబసింగి, తాజంగి, చెరువులవేనంలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూ పాయింట్‌ వద్దకు వేల సంఖ్యలో పర్యాటకులు చేరుకోవడంతో జాతర వాతావరణం తలపించింది. శ్వేత వర్ణంలో అడవులను తాకుతూ పయనిస్తున్న మంచు అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు, యర్రవరం జలపాతం సందర్శకులతో రద్దీగా కనిపించాయి. పర్యాటకులు భారీ సంఖ్యలో లంబసింగికి చేరుకోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ సమస్య ఎదురైంది. చింతపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి లంబసింగిలో మోహరించి ట్రాఫిక్‌ నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే సంవత్సరాంత వేడుకల్లో స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అసాంఘిక చర్యలకు పర్యాటకులు పాల్పడకుండా పోలీసులు 24 గంటలు లంబసింగి పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

బొర్రా గుహలు, అరకులోయలో..

అరకులోయ: ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రాగుహలు, కటికి జలపాతం, గాలికొండ వ్యూపాయింట్‌, అనంతగిరి, బీసుపురం, సుంకరమెట్ట కాఫీ తోటలు, అరకులోయలో ఉన్న గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, చాపరాయి వంటి సందర్శిత ప్రాంతాలన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపించాయి. శనివారం కావడంతో పాటు ఆదివారం డిసెంబరు 31 సందడి నేపథ్యంలో అరకులోయ, బొర్రాగుహలుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి బొర్రాగుహలు ప్రవేశ టికెట్ల ఆదాయం సుమారు రూ.5.5 లక్షలు వచ్చినట్టు సమాచారం. అలాగే అరకులోయ గిరిజన మ్యూజియంలోని కళాగ్రామంలో ఉన్న బోటుషికారు, పలు రకాల గిరిజన మహిళల ప్రతిమల వద్ద పర్యాటకులు ఫొటోలు దిగారు. మాడగడ సన్‌రైజ్‌ పాయింట్‌ వద్ద కూడా సందర్శకుల రద్దీ కనిపించింది.

ముందస్తు న్యూ ఇయర్‌ వేడుకలు

అరకులోయ: గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఉన్న కళా వేదికలో ముందస్తుగా న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించారు. శనివారం రాత్రి థింసా నృత్యాలు, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, లేజర్‌ షో, మ్యూజిక్‌ షో నిర్వహించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మ్యూజియం లోపల ప్రవేశానికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున టికెట్‌ నిర్ణయించారు. ఇక్కడి కార్యక్రమాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం రాత్రి కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఐటీడీఏ పర్యాటక మేనేజర్‌ మురళి తెలిపారు.

చాపరాయి వద్ద..

డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో శనివారం పర్యాటకులు సందడి చేశారు. జలవిహారిని ఆధునికీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు అక్కడ సరదాగా గడిపారు.

Updated Date - Dec 31 , 2023 | 12:29 AM