టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-01-18T00:19:47+05:30 IST

పట్టణంలోని లక్ష్మీదేవిపేటలో నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.

టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై పోలీసులకు ఫిర్యాదు
ఏఎస్‌ఐ దొరకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

అనకాపల్లి అర్బన్‌, జనవరి 17 : పట్టణంలోని లక్ష్మీదేవిపేటలో నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై సదరు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేక గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పట్టణ పోలీసులకు టీడీపీ నాయకులు లాయర్‌ శ్రీను, దొడ్డి రామకోటేశ్వరరావు, కాండ్రేగుల ముకుందరావు, కొణతాల వాసు, కొణతాల శ్రీనివాసరావు, కె.రవికుమార్‌, భర్నికాన నరసింగరావు తదితరులు ఫిర్యాదు చేశారు.

వ్యక్తిపై దాడిచేసిన ఆరుగురిపై కేసు

సబ్బవరం, జనవరి 17 : మండలంలోని గొల్లలపాలెంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. సీతారాముల తీర్థం నిర్వహించేందుకు సోమవారం రాత్రి గొల్లవిల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటైంది. ఇందులో నిర్వహణ ఖర్చులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగావడ్డాది పైడిరాజు, శ్రీను, దేముడమ్మ, సాలాపు తమ్మిరాము, కట్ట అప్పలరాజు, కొసిరెడ్డి సన్యాసమ్మ కలిసి ‘పండగ చేయడానికి నీవు ఎవడివి. పండగను వంగలిపూడి సంతోష్‌ చేస్తాడు’ అంటూ ఈశ్వరరావుపై ముకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఈ మేరకు ఆరుగురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్టు

ఎస్‌.రాయవరం, జనవరి 17 : మండలంలోని గుర్రాజుపేటలో పేకాట శిబిరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

కొట్లాట ఘటనలో ఇరువర్గాల వారిపై కేసులు

మాకవరపాలెం, జనవరి 17: మండలంలోని జి.వెంకటాపురం గ్రామం నగరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన కొట్లాటపై నర్సీపట్నం డీఎస్‌పీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం విచారణ చేపట్టారు. ఇరువర్గాల వారిని విడివిడిగా విచారించారు. రెండు వర్గాల మధ్య గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం డీఎస్‌పీ విలేకర్లతో మాట్లాడుతూ .. ఒక వర్గానికి చెందిన పది మందిపై, అలాగే రెండవ వర్గానికి చెందిన పదిమందిపై కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో అరెస్ట్‌లు చేస్తామన్నారు. అలాగే గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలన్నారు. సమస్యలుంటే ఇరు వర్గాల వారు చర్చించుకోవాలి తప్ప ఇలా తగాదాలకు దిగకూడదన్నారు. అలాగే గ్రామంలో వారం రోజులుపాటు పోలీసు పికెటింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ గ్రామంపై పోలీసు నిఘా ఉండాలని ఎస్‌ఐ రామకృష్ణరావుకు సూచించారు. ఈ విచారణలో సీఐ రమణయ్య, దళిత సంఘం నాయకులు అప్పలరాజు, చలపతిరావు పాల్గొన్నారు.

నేవల్‌ పోలీస్‌ వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

పరవాడ, జనవరి 17 : బ్రేకులు ఫెయిల్‌ కావడంతో నేవల్‌ పోలీస్‌ జీపు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఎలమంచిలి- గాజువాక రహదారిలోని బొట్టవానిపాలెం రామాలయం సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పరిఽధి చినగంట్యాడ ప్రాంతానికి చెందిన వై.తిరుపతిరావు ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం వెళ్లేందుకు బయల్దేరాడు. బొట్టవానిపాలెం వచ్చేసరికి ఎదురుగా వస్తున్న రాంబిల్లి నేవల్‌బేస్‌కు చెందిన పోలీస్‌ జీపు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో తిరుపతిరావు కుడి కాలుకు తీవ్ర గాయమైంది. జీపు స్టిరింగ్‌ కూడా విరిగిపోయింది. క్షతగాత్రుడ్ని స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-18T00:19:49+05:30 IST