కోరమండల్‌ ప్రమాదంతో అలర్ట్‌

ABN , First Publish Date - 2023-06-03T01:09:17+05:30 IST

ఒడిశాలోకి బాలాసోర్‌ సమీపాన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురికావడంతో విశాఖలో రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు.

కోరమండల్‌ ప్రమాదంతో అలర్ట్‌

ఒడిశాలో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌

విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

ఒడిశాలోకి బాలాసోర్‌ సమీపాన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురికావడంతో విశాఖలో రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లాల్సిన రైలు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు పట్టాలు తప్పింది. బోగీలు కొన్ని పక్క ట్రాక్‌పైకి ఒరిగిపోయాయి. ఆ ట్రాక్‌పై రాకపోకలు నిలిపివేసి, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. అధికారులు అందుకు ఉపక్రమించేలోపే ఆ ట్రాక్‌పై వచ్చిన యశ్వంతపూర్‌-హౌర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అక్కడ పడి వున్న బోగీలను ఢీకొట్టింది. దాంతో ఆ రైలులో కూడా కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. మొత్తం 14 నుంచి 16 బోగీలు పట్టాలు తప్పి ఉంటాయని సమాచారం. పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు మరణాలను ప్రకటించలేదు. కోరమండల్‌ రైలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. విశాఖకు సంబంధించిన వారి వివరాలు తెలుసుకోవడానికి 0891-2746330, 0891-2744619 నంబర్లకు సంప్రతించాలని రైల్వే అధికారులు తెలిపారు.

12509 నంబరు బెంగళూరు-గౌహతి రైలును వయా విజయనగరం మీదుగా టిటాఘర్‌, జార్సుగుడ మీదుగా నడుపుతున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2023-06-03T01:09:17+05:30 IST