వంట కష్టం

ABN , First Publish Date - 2023-08-02T01:24:42+05:30 IST

‘‘ఆరిలోవ ప్రాంతంలో గల తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారుచేస్తున్నాం.

వంట కష్టం

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల గగ్గోలు

పెరిగిన ధరలతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన

కిలో టమాటా రూ.180 నుంచి రూ.200కి కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆందోళన

కందిపప్పు, ఇతర దినుసుల రేట్లు పెరుగుదల

ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

‘‘ఆరిలోవ ప్రాంతంలో గల తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారుచేస్తున్నాం. సగటున రోజుకు 600 నుంచి 700 మంది పిల్లలు ఉంటున్నారు. సోమవారం కోడిగుడ్డు కూర, గురువారం చట్నీ తయారీకి విధిగా టమాటా ఉండాలి. ప్రస్తుతం కిలో టమాటా రూ.180 నుంచి రూ.200 పెట్టి కొంటున్నాం. కందిపప్పు, కూరగాయలు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మిరపకాయల ధర కిలో రూ.350, కందిపప్పు రూ.135 నుంచి రూ.140 వరకూ ఉంది. ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్నదాని కంటే పెట్టుబడి ఎక్కువ అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తం పెంచకపోతే వంట చేయడం మా వల్ల కాదు.’’

- మొల్లి అప్పలనరసమ్మ, అధ్యక్షురాలు, విజయదుర్గ పొదుపు సంఘం

పెరిగిన నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు తమకు భారంగా మారాయని మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చార్జీలతో మెనూ అమలు చేయడం సాధ్యం కాదంటున్నారు. కందిపప్పు, మిరపకాయలు, పోపు దినుసులు, టమాటా, ఇతర కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ లెక్కనైతే అప్పులు పాలవ్వడం ఖాయమని వాపోతున్నారు. పెరిగిన ధరల మేరకు సగటున ఒక్కో విద్యార్థిపై రెండు నుంచి మూడు రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో వారానికి రెండు రోజులు విధిగా టమాటా వాడాలి. సోమవారం గుడ్డు కూరలో టమాటా వేయాలి. అలాగే గురువారం పులిహోరతో టమాటా చట్నీ అందించాలి. కిలో రూ.20 నుంచి రూ.30 వరకు దొరికే టమాటాను ఇప్పుడు రూ.180 నుంచి రూ.200 పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు పథకం నిర్వాహకులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 85 వేల మంది ఉన్నారు. వీరిలో రోజూ బడికి వచ్చేవారు 65 వేల నుంచి 70 వేల వరకు ఉంటారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ.5.88, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.8.57 చొప్పున వంట వండే సంఘాలకు ప్రభుత్వం అందజేస్తోంది. బియ్యం అదనంగా సరఫరా చేస్తోంది. విద్యార్థుల సంఖ్య బట్టి పాఠశాలలో వంట వండే సంఘం ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురికి నెలకు రూ.మూడు వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ప్రతి ఏడాది కొన్ని సీజన్‌లలో కూరగాయలు, పప్పుల రేట్లు పెరగడం తరువాత తగ్గడం సాధారణ విషయం. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా పప్పులు, కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో వంట వండే పొదుపు సంఘాలపై భారం పడుతుంది. ధరలతో సంబంధం లేకుండా మెనూ అమలుచేయాల్సిందేనని హెచ్‌ఎంలు తెగేసి చెబుతున్నారు.

చేతి చమురు వదులుతుంది

జి.మంగశ్రీ, కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం

మారికవలవ ప్రాఽథమిక పాఠశాలలో పిల్లలకు వంట వండే బాధ్యత మా పొదుపు సంఘం తీసుకుంది. 28 మంది పిల్లలు ఉండగా, రోజు 25 మంది వరకు వస్తుంటారు. వారానికి రెండు రోజులు టమాటా వాడాలి. కిలో రూ.180 పెట్టి కొంటున్నాము. 25 మంది పిల్లలకు భోజనం తయారీకి సగటున రూ.180 నుంచి రూ.200 ఖర్చు అవుతుంది. అదే ప్రభుత్వం రూ.147 అందజేస్తోంది. మిగిలిన సొమ్ము మేము భరించాలి. ఐదారేళ్ల క్రితానికి ఇప్పటికీ ధరలు చాలా పెరిగాయి. ఈ ధరలతో ప్రభుత్వం ఇచ్చిన మెనూ అమలుచేయలేకపోతున్నాం.

Updated Date - 2023-08-02T01:24:42+05:30 IST