విమ్స్‌లో నేచురోపతి కళాశాల

ABN , First Publish Date - 2023-03-20T01:17:33+05:30 IST

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో నేచురోపతి మెడికల్‌ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకానున్నది.

విమ్స్‌లో నేచురోపతి కళాశాల

మొదటి దశలో 60 సీట్లతో ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు

బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగా సైన్సెస్‌ కోర్సులో ప్రవేశాలు

50 పడకలతో ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ హాస్పిటల్‌ కూడా...

అందుబాటులోకి రానున్న ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురోపతికి సంబంధించి స్పెషాలిటీ సేవలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో నేచురోపతి మెడికల్‌ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని ఏర్పాటుచేస్తున్నాయి. ఇందుకోసం విమ్స్‌ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. భవన నిర్మాణ బాధ్యతలను ఏపీఎంఎస్‌ఐడీసీ అప్పగించింది. వచ్చే ఏడాది నుంచి తరగతులు నిర్వహించేందుకు భవనాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అలాగే, వచ్చే ఏడాది జనవరి నాటికి ఆయుష్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

విభజన తరువాత

నేచురోపతి మెడికల్‌ కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బేగంపేటలో ఉంది. విభజన తరువాత ఏపీలో నేచురోపతి వైద్యశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా పలు రాష్ట్రాలకు కేంద్రం నేచురోపతి మెడికల్‌ కళాశాలలను మంజూరుచేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. మొదటి దశలో ఈ మెడికల్‌ కళాశాలలో 60 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐదున్నరేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగా సైన్సెస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. దశల వారీగా సీట్ల సంఖ్యను పెంచనున్నారు. కళాశాల భవనాల నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నాయి. కళాశాలలో పనిచేసేందుకు అవసరమైన ఫ్యాకల్టీ, సిబ్బంది భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది.

50 పడకలతో ఆయుష్‌ ఆస్పత్రి

విమ్స్‌ ప్రాంగణంలోనే 50 పడకలతో ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రిని కేంద్రం ఏర్పాటుచేయనున్నది. విశాఖ పట్నంతోపాటు కాకినాడలో కూడా ఆస్పత్రి ఏర్పాటు చేయబోతోంది. ఆయుష్‌ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురోపతికి సంబంధించి స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రధానంగా పక్షవాతం, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, సైనసైటిస్‌ వంటి అనేక రకాల వ్యాధులకు సేవలు అందించనున్నారు. పంచకర్మ వంటి వైద్య పద్ధతుల్లో రోగులకు వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, కొద్దిరోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయుష్‌ ఆర్డీ శేఖర్‌ తెలిపారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయుష్‌ డిస్పెన్సరీల్లో మందులు మాత్రమే అందిస్తున్నామని, ఆస్పత్రి ఏర్పాటైతే రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వైద్య సేవలు అందించనున్నట్టు వివరించారు.

Updated Date - 2023-03-20T01:17:33+05:30 IST