డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2023-05-13T01:38:01+05:30 IST

కాఫీపై గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దృష్టిసారించింది. విశాఖ ఏజెన్సీలో విస్తృతంగా సాగులో వున్న కాఫీని జీసీసీ...రైతుల నుంచి సేకరించి, శుద్ధి చేసి జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వేయి టన్నుల కాఫీని కొనుగోలు చేసింది. వేయి టన్నుల్లో 480.28 టన్నులు పార్చుమెంట్‌ కాఫీ కాగా, ఇంకో 515.81 టన్నుల చెర్రీ. పార్చుమెంట్‌కు కిలోకు రూ.285 చొప్పున, చెర్రీకి రూ.145 చెల్లించింది.

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్‌ సెంటర్‌
జి.సురేశ్‌కుమార్‌, ఎండీ, జీసీసీ

రూ.4 కోట్లతో నిర్మాణం

గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులు కొనుగోలు చేసిన జీసీసీ

రూ.20 కోట్ల టర్నోవర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కాఫీపై గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దృష్టిసారించింది. విశాఖ ఏజెన్సీలో విస్తృతంగా సాగులో వున్న కాఫీని జీసీసీ...రైతుల నుంచి సేకరించి, శుద్ధి చేసి జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వేయి టన్నుల కాఫీని కొనుగోలు చేసింది. వేయి టన్నుల్లో 480.28 టన్నులు పార్చుమెంట్‌ కాఫీ కాగా, ఇంకో 515.81 టన్నుల చెర్రీ. పార్చుమెంట్‌కు కిలోకు రూ.285 చొప్పున, చెర్రీకి రూ.145 చెల్లించింది. మొత్తంగా చూసుకుంటే కాఫీ లావాదేవీల ద్వారా రూ.20 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఒక్క కాఫీ ద్వారా రూ.1.5 కోట్ల వరకు లాభం రావడంతో అందులో 50 లక్షల మొత్తాన్ని సామాజిక సేవ కింద తిరిగి గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులతో గిరిజనులు కాఫీ ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడే టార్పాలిన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

బెంగళూరులో ప్రాసెసింగ్‌

సేకరించిన కాఫీని ఎంత చక్కగా ప్రాసెసింగ్‌ చేస్తే అంత మంచి ధర లభిస్తుంది. అందుకని జీసీసీ ఇక్కడ సేకరించిన కాఫీని బెంగళూరుకు పంపించి అక్కడ ప్రాసెసింగ్‌ చేయించేది. దీనికి కొంత వ్యయం అయ్యేది. అయితే ఇక్కడే ప్రాసెసింగ్‌ సెంటర్‌ కూడా పెడితే స్థానికులకు ఉపాధి కూడా కలుగుతుందని భావించడంతో ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రాసెసింగ్‌, రోస్టింగ్‌, గ్రైండింగ్‌ అన్నీ ఇక్కడే చేసుకునేలా యూనిట్‌ మంజూరుచేశారు. దీనిని ఎక్కడ పెట్టాలా? అని ఆలోచించి, కాఫీ రైతులకు అందుబాటులో ఉండేలా డౌనూరును ఎంపిక చేశారు. అక్కడ జీసీసీకి ఐదు ఎకరాల వరకు స్థలం ఉంది. అందులో నాలుగు కోట్ల రూపాయలతో ప్రాసెసింగ్‌ సెంటర్‌ పెట్టాలని నిర్ణయించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇంకో ఆరు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

జీసీసీ ద్వారానే ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌

ఏజెన్సీలో రైతులు ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా కాఫీని పండిస్తున్నారు. జీసీసీ వాటిని పర్యవేక్షిస్తూ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోంది. చింతపల్లి మండలంలో 885 హెక్టార్లలో 1,300 మంది రైతులకు, జీకే వీధి మండలంలో 1,374 హెక్టార్లలో మరో 1,300 మంది రైతులకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోంది. ఇదికాకుండా మరో 2,600 ఎకరాల్లో గిరిజనులు పండిస్తున్న కాఫీకి కూడా ఈసారి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇంటిగ్రేటెడ్‌ యూనిట్‌ పెడతాం

జి.సురేశ్‌కుమార్‌, ఎండీ, జీసీసీ

సేకరించిన కాఫీని ఇక్కడే ప్రాసెసింగ్‌ చేసి, బీన్స్‌ని రోస్టింగ్‌ చేసి, వాటిని గ్రైండింగ్‌ చేసి పౌడర్‌ తయారుచేసేలా ఇంటిగ్రేటెడ్‌ యూనిట్‌ పెట్టాలని భావిస్తున్నాము. సుమారు నాలుగు కోట్ల వ్యయం అవుతుంది. దీనికి టెండర్‌ కూడా సిద్ధం చేశాం. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తరువాత పనులు ప్రారంభిస్తాం.

Updated Date - 2023-05-13T01:38:01+05:30 IST