కాఫీ రైతు విలవిల
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:52 AM
‘మన్యంలోని కాఫీకి ప్రపంచ ఖ్యాతి... కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలు అందించడమే లక్ష్యం’ అంటూ పాలకులు, అధికారులు చేసే ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక తల పట్టుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో సరైన మార్కెటింగ్ సదుపాయం లేక ప్రైవేటు వర్తకులపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అధికారులు మాత్రం కాఫీ గింజలు ప్రైవేటు వర్తకులకు విక్రయించి మోసపోవద్దని ప్రకటిస్తున్నారే గాని ప్రత్యామ్నాయంగా ఎటువంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక కాఫీ రైతులు విలవిల్లాడుతున్నారు.
- ధర గిట్టుబాటు కాకపోవడంతో గుబులు
- ఏజెన్సీలో కాఫీ మార్కెటింగ్ సదుపాయం శూన్యం
- ప్రైవేటు వర్తకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి
- తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన దుస్థితి
- మరో నెలన్నర రోజుల్లో ముగియనున్న కాఫీ సీజన్
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
‘మన్యంలోని కాఫీకి ప్రపంచ ఖ్యాతి... కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలు అందించడమే లక్ష్యం’ అంటూ పాలకులు, అధికారులు చేసే ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక తల పట్టుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో సరైన మార్కెటింగ్ సదుపాయం లేక ప్రైవేటు వర్తకులపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అధికారులు మాత్రం కాఫీ గింజలు ప్రైవేటు వర్తకులకు విక్రయించి మోసపోవద్దని ప్రకటిస్తున్నారే గాని ప్రత్యామ్నాయంగా ఎటువంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక కాఫీ రైతులు విలవిల్లాడుతున్నారు.
సంతల్లోని ప్రైవేటు వర్తకులే ఆధారం
ప్రస్తుతం గిరిజన కాఫీ రైతులు ప్రైవేటు వర్తకులపైనే ఆధారపడి తమ పంటను విక్రయించుకుంటున్నారు. అధికారులు చెబుతున్నారని పంటలను అమ్ముకోకపోతే, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో వారపు సంతల్లోని వర్తకులకే కాఫీ గింజలను గిరిజన రైతులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు, వర్తకులు కిలో కాఫీ పండ్లు రూ.50, కిలో పార్చిమెంట్ రూ.320 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా ఎక్కువ మంది రైతులు కాఫీ పండ్లు విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. గిరిజనులు కాఫీ పండ్లు శుద్ధి చేసి పార్చిమెంట్ (పప్పు)గా చేసి గతంలో విక్రయించేవారు. కానీ కాఫీ పండ్ల ధర ఆశాజనకంగా ఉండడం, పార్చిమెంట్ ధర తక్కువ కావడంతో పండ్లనే విక్రయిస్తున్నారు. ఆరు కిలోల కాఫీ పండ్లు శుద్ధి చేస్తే ఒక కిలో పార్చిమెంట్ వస్తుంది. కిలో పార్చిమెంట్‌ను జీసీసీ కేవలం రూ.280కే కొనుగోలు చేస్తున్నది. అదే ఆరు కిలోల పండ్లు విక్రయిస్తే రూ.300 ఆదాయం వస్తుంది. దీంతో కాఫీ పండ్లు విక్రయించడమే తమ లాభంగా వుందని భావించిన కాఫీ రైతులు దానిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
కాఫీకి మార్కెటింగ్ సదుపాయం శూన్యం
ఏజెన్సీలో అధిక విస్తీర్ణంలో కాఫీ తోటలున్నప్పటికీ, కాఫీకి సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాట ధర కలగానే మిగులుతున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటల్లో 70 వేల టన్నుల కాఫీ పండ్లు, వాటిని శుద్ధి చేస్తే 15 వేల టన్నుల క్లీన్ కాఫీ ఉత్పత్తి అవుతోంది. కానీ దానిలో కనీసం 5 వేల టన్నుల క్లీన్ కాఫీకి ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించలేకపోవడంపై కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర విషయం అటుంచితే, కనీస మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించలేకపోవడం దారుణమని గిరిజనులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏజెన్సీలో ప్రైవేటు సంస్థలు, వర్తకులు కిలో రూ.50 చొప్పున కాఫీ పండ్ల్లను కొనుగోలు చేస్తుండగా, ఐటీడీఏ ఆధ్వర్యంలో చింతపల్లిలో ఏర్పాటు చేసిన మ్యాక్స్ సొసైటీ ద్వారా కిలో రూ.43 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అలాగే కిలో పార్చిమెంట్‌ను సంతల్లో వర్తకులు రూ. 300 నుంచి రూ. 320లకు కొనుగోలు చేస్తుంటే, ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ మాత్రం రూ.280లకే కొనుగోలు చేస్తున్నది. ఈ ధరల వ్యత్యాసంతోనే రైతులు మ్యాక్స్ సొసైటీ, జీసీసీకి విక్రయించేందుకు ముందుకురావడం లేదని స్పష్టమవుతున్నది.
లక్ష్యం చేరని కాఫీ కొనుగోళ్లు
ఏజెన్సీలో అధిక విస్తీర్ణంలో కాఫీ పంట సాగవుతున్నప్పటికీ సరైన ధర, ప్రణాళిక లేక చింతపల్లిలోని మ్యాక్స్ సొసైటీగాని, జీసీసీ గాని ఏనాడు తమ కొనుగోళ్ల లక్ష్యాన్ని చేరులేకపోతున్నాయి. ఈ ఏడాది మ్యాక్స్ సొసైటీ ద్వారా 4 వేల టన్నుల కాఫీ పండ్లు కొనాలనేది లక్ష్యంగా కాగా, ఇప్పటికి కేవలం 700 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అలాగే జీసీసీ 1,500 టన్నుల క్లీన్ కాఫీ కొనుగోలు చేయాలనేది లక్ష్యం కాగా, ప్రస్తుతానికి కేవలం 70 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మరో నెలన్నర రోజుల్లో కాఫీ క్రయవిక్రయాల సీజన్ ముగియనుంది. ఈ తరుణంలో మ్యాక్స్ సొసైటీ, జీసీసీ సైతం తమ లక్ష్యంలో 50 శాతం సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. ఐటీడీఏ, కాఫీ విభాగం, కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సైతం మన్యంలోని కాఫీ మార్కెటింగ్ సదుపాయాలపై సూక్ష్మమైన అధ్యాయనం చేసి, గిరిజన రైతులకు మేలు చేసేందుకు అవసరమైన పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని గిరి రైతులు కోరుతున్నారు.