కైలాసగిరిపై మళ్లీ సర్క్యులర్ ట్రైన్
ABN , First Publish Date - 2023-05-26T01:39:40+05:30 IST
‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే పదం కొన్నాళ్ల క్రితం బాగా పాపులర్ అయింది.

రైల్వే సాయంతో నడిపేందుకు వీఎంఆర్‌డీఏ యత్నం
ప్రైవేటు సంస్థ నుంచి స్వాధీనం
కలిసొచ్చిన ‘యాక్ట్ ఆఫ్ గాడ్’
మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థే
తమకు బకాయి ఉందంటున్న ప్రైవేటు సంస్థ నిర్వాహకులు
ఇందులో రాజకీయం ఉందని ఆరోపణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే పదం కొన్నాళ్ల క్రితం బాగా పాపులర్ అయింది. సినీ హీరోలు వెంకటేశ్, పవన్‌కల్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలోని కోర్టు సన్నివేశాల్లో దీనిని ఉపయోగించారు. ఊహించని విధంగా ప్రకృతి వల్ల ఆస్తి నష్టం జరిగితే దానిని ‘యాక్ట్ ఆఫ్ గాడ్’గా పరిగణించాలనేది దాని అర్థం. తాజాగా సరిగ్గా ఇదే పదం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ వినియోగించి విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కోర్టులో వ్యాజ్యం గెలుచుకుంది. కైలాసగిరిపై సర్క్యులర్ ట్రైన్ ప్రాజెక్టును ఈ నెల 13న స్వాధీనం చేసుకుంది. దీనిని ఇప్పుడు విశాఖపట్నం రైల్వే అధికారుల సాయంతో స్వయంగా వీఎంఆర్‌డీఏనే నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రైల్వే అధికారులు వచ్చి రైల్వే లైన్, ట్రైన్ అన్నీ పరిశీలించారు. సాంకేతికంగా కొన్ని మరమ్మతులు అవసరమని, అవి పూర్తయిన తరువాత నడపవచ్చునని సూచించారు.
ఏం జరిగిందంటే...
కైలాసగిరిపై సర్క్యులర్ ట్రైన్ నడిపేందుకు పీపీపీ విధానంలో బీఓటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) కింద శారదా రోడ్ వేస్ అనే సంస్థతో 2003లో వుడా ఒప్పందం చేసుకుంది. లీజు కాలం 22 సంవత్సరాలు. స్థలం వుడాది. మిగిలిన పెట్టుబడి ఆ సంస్థది. ఏడాదికి రూ.4.5 లక్షలు చెల్లించడం, ఐదేళ్లకోసారి దానిని మరికొంత పెంచడం, దీనితో పాటు నెలనెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం చెల్లించడం. 2005లో అధికారికంగా సంతకాలు జరిగాయి. 2007లో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఇదిలావుండగా సదరు సంస్థ లీజు మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పెడుతూ వచ్చింది. ఇది లక్షలు దాటి కోట్ల రూపాయల్లోకి వచ్చింది. నోటీసు ఇచ్చినప్పుడల్లా అందులో పదో వంతు కడుతూ వచ్చింది. మార్చి, 2020లో కరోనా రావడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అన్ని పర్యాటక ప్రాంతాల్లాగే కైలాసగిరిపైకి రాకపోకలు ఆపేశారు. ఇలా సుమారు పది నెలలు ట్రైన్ నడపలేదు. ఆ తరువాత వీఎంఆర్‌డీఏ అధికారులు బకాయి చెల్లించాలంటూ నోటీసు ఇచ్చారు. దాంతో సదరు సంస్థ తిరిగి వీఎంఆర్‌డీఏ తనకు బకాయి ఉందంటూ తిరుగు సమాధానం ఇచ్చింది. కరోనా కాలంలో ట్రైన్ నడపకపోవడం వల్ల నష్టం వచ్చిందని, అలాగే తనకు కొండపై వ్యాపారం చేసుకోవచ్చునని ఒప్పందంలో ఉందని, అనేకసార్లు దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతులు కోరితే ఇవ్వలేదని, దానివల్ల కూడా నష్టం జరిగిందని, వీఎంఆర్‌డీఏ నుంచి డబ్బులు వస్తాయని పేర్కొంది. వీఎంఆర్‌డీఏ రూ.2.45 కోట్లు బకాయిలు చూపిస్తే...సదరు శారదా సంస్థ రూ.4.53 కోట్లు తనకు వస్తాయని ఎదురు లేఖ పంపింది. జరగని వ్యాపారాన్ని చూపించడం తగదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా కాలంలో వ్యాపారం లేదు కాబట్టి అంతేకాలం అదనంగా పొడిగింపు ఇస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక్కడే వారు ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ పదాన్ని వినియోగించారు. కరోనా ఎవరూ కావాలని చేసింది కాదని, అది ప్రకృతి వల్ల జరిగిన నష్టం కాబట్టి...దానిని ఇలా క్లెయిమ్ చేయడం కుదరదని తేల్చారు. డబ్బులు చెల్లించకపోతే లెసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దాంతో సదరు సంస్థ నగరంలోని వాణిజ్య వివాదాల కోర్టును ఆశ్రయించింది. తనకు నష్టం జరిగిందని, వీఎంఆర్‌డీఏ తిరిగి డబ్బులు ఇవ్వాలని వివరించింది. కోర్టు స్టే ఇచ్చింది. అయితే రూ.80 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. చెప్పిన గడువులోగా సదరు సంస్థ రూ.40 లక్షలు మాత్రమే డిపాజిట్ చేసింది. దాంతో వీఎంఆర్‌డీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నెల 13న సర్క్యులర్ ట్రైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రాజెక్టు స్వాధీనానికి వచ్చిన కరూర్ వైశ్యా బ్యాంక్
ఇదిలావుండగా శారదా రోడ్ వేస్ సంస్థ కైలాసగిరిపై సర్క్యులర్ ట్రైన్ కోసమని నగరంలో కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి సుమారు రూ.2 కోట్ల రుణం తీసుకుంది. దీనికి హామీగా కైలాసగిరిపై చరాస్తులను తనఖా పెట్టింది. దాంతో పాటు కృష్ణా జిల్లాలో 72 సెంట్ల భూమిని కూడా చూపించింది. కొద్దికాలంగా వాయిదాలు చెల్లించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కైలాసగిరిపై చరాస్తులు స్వాధీనం చేసుకోవడానికి కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు వచ్చారు. అయితే అవన్నీ వీఎంఆర్‌డీఏకు సంబంధించినవని, ఇంకా ఆ సంస్థ నుంచి తమకు రూ.కోట్లలో బకాయి రావలసి ఉందని అధికారులు చెప్పడంతో బ్యాంకు అధికారులు వెనుతిరిగారు.
చాలా నష్టపోయాం...కోర్టులో వాయిదా ఉంది
వెలగపూడి గోపాలకృష్ణ, ప్రాజెక్టు నిర్వాహకులు
సర్క్యులర్ ట్రైన్ వల్ల మేము చాలా నష్టపోయాం. వీఎంఆర్‌డీఏనే మాకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. జూన్‌లో వాయిదా ఉంది. ఇందులో రాజకీయాలు ఉన్నాయి. కావాలనే వేధిస్తున్నారు.