అడవిలో ప్రసవాలు
ABN , First Publish Date - 2023-08-02T01:06:42+05:30 IST
రహదారి సౌకర్యం లేక మండలంలోని నల్లగొండ శివారు బోయవూట గిరిజన గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను డోలీల్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో వారు ప్రసవించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశ కార్యకర్త వారి వెంట ఉండడంతో ప్రసవా నంతరం శిశువులతో సహా వారిని క్షేమంగా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
- బోయవూట గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇద్దరు గర్భిణులను డోలీల్లో తరలింపు
- ఆస్పత్రికి వెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రసవం
- సపర్యలు చేసి పీహెచ్‌సీకి తరలించిన వైద్య సిబ్బంది
- తల్లులు, బిడ్డలు క్షేమం
- రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థుల ఆవేదన
కొయ్యూరు, ఆగస్టు 1: రహదారి సౌకర్యం లేక మండలంలోని నల్లగొండ శివారు బోయవూట గిరిజన గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను డోలీల్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో వారు ప్రసవించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశ కార్యకర్త వారి వెంట ఉండడంతో ప్రసవా నంతరం శిశువులతో సహా వారిని క్షేమంగా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
బోయవూట గ్రామానికి చెందిన వంతల సుశీల ఏడవ కాన్పుకు గాను, పాంగి చిన్నారి నాలుగవ కాన్పుకు గర్భం దాల్చారు. వారికి ప్రతి నెలా వైద్య సేవలు అందించడంతో పాటు స్కానింగ్ ఆధారంగా ఈ నెల 6వ తేదీన ప్రసవం అవుతుందని వైద్య సిబ్బంది నిర్ధారిం చారు. గత వారం వీరి ఆరోగ్య స్థితిగతులను రావణాపల్లి సచివాలయ ఏఎన్‌ఎం తలుపులమ్మ పరీక్షించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వారిద్దరూ వ్యవసాయ పనుల్లో ఉండగా ఉన్నట్టుండి పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆశ కార్యకర్తకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఏఎన్‌ఎంకు ఆశ కార్యకర్త సమాచారం అందించి గ్రామస్థుల సహకారంతో ఆస్పత్రికి తరలించేందుకు డోలీ కట్టించింది. వారిద్దర్నీ డోలీల్లో గ్రామ శివారుకు తీసుకు వచ్చేసరికి సుశీల ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు సపర్యలు చేసి పిడతమామిడి వరకు డోలీలో తీసుకువచ్చి అక్కడ నుంచి ఫీడర్ అంబులెన్స్‌లో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అలాగే పాంగి చిన్నారిని అటవీ ప్రాంతం గుండా గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు తరలించగా మార్గమధ్యంలో అడవిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను కూడా క్షేమంగా పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతానికి మాతా శిశువులు క్షేమంగా ఉన్నారు.
బోయవూట చేరాలంటే సాహసమే..
కొండ శిఖర గ్రామమైన బోయవూటలో సుమారు 150 మంది ఆదివాసీ గిరిజన తెగకు చెందిన వారు జీవిస్తున్నారు. ఈ గ్రామానికి అంతాడ లేదా రొంపుల నుంచి పారికెలు, నిమ్మలగొంది మీదుగా సుమారు 10 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతం నుంచి నడిచి వెళ్లాలి. మండల కేంద్రం నుంచి అయితే పిడతమామిడి నుంచి సుమారు 8 కిలోమీటర్లు, లేదా నల్లగొండ నుంచి అయితే 7 కిలోమీటర్లు కొండ ఎక్కాలి. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో సాహసించి దట్టమైన అటవీ ప్రాంతం నుంచి నడిచి వెళ్లాలి. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీ మోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.