సర్దుబాటులో మార్పులు

ABN , First Publish Date - 2023-01-25T00:33:44+05:30 IST

ఉపాధ్యాయుల సర్దుబాటులో లోటుపాట్లు ఏమైనా వుంటే సరిచేస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 22వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేయాలని యోచిస్తున్నారు. అయితే కౌన్సెలింగ్‌ ద్వారా సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌పై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

సర్దుబాటులో మార్పులు
ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చిస్తున్న డీఈవో చంద్రకళ

లోటుపాట్లు సరిచేస్తామంటున్న విద్యా శాఖ అధికారులు

ఉమ్మడి జిల్లాలో 539 మంది ఉపాధ్యాయులను

సర్దుబాటు చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు

సర్దుబాటు ప్రక్రియ కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టాలని

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలి

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న విశాఖ డీఈవో

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయుల సర్దుబాటులో లోటుపాట్లు ఏమైనా వుంటే సరిచేస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 22వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేయాలని యోచిస్తున్నారు. అయితే కౌన్సెలింగ్‌ ద్వారా సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌పై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఉమ్మడి జిల్లాలో 539 టీచర్లను ఇష్టానుసారంగా సర్దుబాటు చేయడంపై ‘టీచర్లకు సర్దుపోటు’ శీర్షికన ఈనెల 23న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. అధికారుల తీరుపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ అధ్యక్షతన మంగళవారం డీఈవో కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జక్టు టీచర్ల కొరత వున్న నేపథ్యంలో సమీపంలో ఉన్నత పాఠశాలలు/యూపీ పాఠశాలల నుంచి మిగులు టీచర్లను సర్దుబాటు చేయడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే అనేక ఏళ్లుగా వున్న సంప్రదాయానికి భిన్నంగా...పనిచేస్తున్నచోట నుంచి దూర ప్రాంతాల్లో పాఠశాలలకు పంపడం తగదంటూ ఎవరెవరిని ఎక్కడెక్కడకు వేశారో పేర్లతో సహా వివరించారు. సర్దుబాటు చేయడానికి మండలం యూనిట్‌గా తీసుకోవాలని...ఒకవేళ ఆ మండలంలో టీచర్లు లభ్యం కాకపోతే పొరుగు మండలాల వారిని అవసరం మేరకు తీసుకోవాలని కోరారు. అప్పటికి కూడా మిగులు/తగులు వుంటే డివిజన్‌ స్థాయిలో పాఠశాలలకు సర్దుబాటు చేయాలన్నారు. అదేవిధంగా మేనేజ్‌మెంట్ల వారీగా అంటే జడ్పీ నుంచి జడ్పీ, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సర్దుబాటు చేయాలని కోరారు. కౌన్సెలింగ్‌ ద్వారా టీచర్‌ల సర్దుబాటు చేయాలని, ఈ విషయంలో సిఫారసులు, ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరారు. అనంతరం డీఈవో చంద్రకళ మాట్లాడుతూ నిబంధనల మేరకు సర్దుబాటు చేశామని వివరించారు. కౌన్సెలింగ్‌ విధానంలో సర్దుబాటు చేయాలన్న అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కాగా సమన్వయ సమావేశంలో విద్యా శాఖ తరపున లక్ష్మణరావు, ఉపాధ్యాయ సంఘాల పక్షాన గొంది చిన్నబ్బాయ్‌, వి.శ్రీలక్ష్మి (యూటీఎఫ్‌), జి.గోపినాథ్‌, ఎం.శ్రీనివాస్‌ (పీఆర్‌టీయూ), కొటాన శ్రీనివాసరావు, రామకృష్ణ (ఏపీటీఎఫ్‌), రామిరెడ్డి, దేముడుబాబు (ఎస్టీయూ) ధరేంద్రరెడ్డి (డీటీఎఫ్‌) తదితరులు హాజరయ్యారు.

కౌన్సెలింగ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

చంద్రకళ, విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిణి

ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం జరిగింది. సంఘాలు ప్రస్తావించిన పలు అంశాలను ఒక్కొక్కటిగా నివృత్తిచేశాం. సర్దుబాటు జాబితాలో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాం. అయితే కౌన్సెలింగ్‌ ద్వారా సర్దుబాటు చేయాలన్న డిమాండ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - 2023-01-25T00:33:45+05:30 IST