నేడు చంద్రబాబు రాక
ABN , First Publish Date - 2023-12-03T01:12:44+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం నగరానికి రానున్నారు.
అప్పన్న దర్శనం అనంతరం తిరుగుపయనం
జైలు నుంచి విడుదలైన తరువాత మొదటిసారి నగరానికి వస్తున్న టీడీపీ అధినేత
స్వాగతానికి పార్టీ శ్రేణుల భారీ ఏర్పాట్లు
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం నగరానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కొద్దిసేపు నేతలకు ముచ్చటిస్తారు. అక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరి 12.25 గంటలకు సింహాచలం వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి ఒంటిగంటకు బయలుదేరి 1.25 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 1.35 గంటలకు హైదరాబాద్ వెళతారు. జైలు నుంచి విడుదలైన తరువాత తొలిసారిగా విశాఖపట్నం రానున్న అధినేతకు ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో నేతలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. గోపాలపట్నం వద్ద స్వాగతం పలికే బాధ్యత విశాఖ పశ్చిమ నియోజకవర్గం నేతలకు, అక్కడనుంచి సింహాచలం గోశాల వరకు జన సమీకరణ బాధ్యత పెందుర్తి నియోజకవర్గ నేతలకు అప్పగించారు. సింహాచలం తొలిపావంచా వద్దకు జనసమీకరణ బాధ్యతను భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాలకు అప్పగించారు.