మండిన నగరం

ABN , First Publish Date - 2023-06-03T01:14:23+05:30 IST

ఎండ తీవ్రతకు శుక్రవారం నగరవాసులు మాడిపోయారు.

మండిన నగరం

ఇటు ఎండ, అటు ఉక్కపోతతో విలవిల్లాడిన జనం

పలు ప్రాంతాల్లో 40.3 డిగ్రీలు నమోదు

పెందుర్తిలో 39.6, అనందపురంలో 39.2, ఎయిర్‌పోర్టులో 39 డిగ్రీలు...

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రతకు శుక్రవారం నగరవాసులు మాడిపోయారు. ఉదయం ఏడు గంటలకే ఎండ తీవ్రంగా ఉంది. పది గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం వెనుకాడారు. పడమర దిశ నుంచి వస్తున్న పొడి గాలులకు నగరం నిప్పుల కొలిమిలా మారింది. దీనికితోడు మధ్యాహ్నం నుంచి సముద్రం మీదుగా తేమగాలులు వీయడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంది. కొద్దిరోజులు వర్షాలు కురవడంతో చల్లబడిన వాతావరణం గడిచిన రెండు, మూడు రోజులుగా క్రమేపీ మళ్లీ వేడెక్కుతోంది. శుక్రవారం విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా పెందుర్తిలో 39.6, అనందపురంలో 39.2 డిగ్రీలు నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎయిర్‌పోర్టులో 39 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని పేర్కొంది. జూన్‌ మొదటి వారంలో ఉత్తర కోస్తాలో ఎండలు పెరగడం సాధారణమేనని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రుతుపవనాలు ప్రవేశించేంత వరకు ఎండ ప్రభావం ఉంటుందని, అయితే మధ్యలో వర్షాలు కురిసినప్పుడు మాత్రమే కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.

Updated Date - 2023-06-03T01:14:23+05:30 IST