ప్రమాదంలో వంతెనలు!
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:47 AM
చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలోని భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో వంతెనలు, కల్వర్టులు ఒక్కటొక్కటిగా కూలిపోతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మితం కావడం, ఏళ్ల తరబడి నిర్వహణ కొరవడడంతో వంతెనలు బలహీనంగా మారుతున్నాయి. సామర్థ్యానికి మించి అధిక బరువుతో భారీ వాహనాలు వెళుతుండడం, వంతెనల పిల్లర్లకు సమీపంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో ప్రమాదకరంగా మారి వంతెనలు కుంగి, కూలిపోతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను వేరే మార్గాల్లోకి మళ్లిస్తుండడంతో ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలకు చేరువాల్సి వస్తున్నది.
బీఎన్ రోడ్డులో ఒక్కటొక్కటిగా కూలుతున్న బ్రిడ్జిలు, కల్వర్టులు
2015లో పొట్టిదొరపాలెం, బొడ్డేరు వంతెనలు..
గత ఏడాది మే నెలలో కుంగిన వడ్డాది వంతెన
తుఫాన్ వర్షాలకు బంగారుమెట్ట జంక్షన్ సమీపంలో కుంగి, కొట్టుకుపోయిన కల్వర్టు
తాజాగా విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెన
గోవాడ వంతెనకు పొంచివున్న ముప్పు
గ్రానైట్ రవాణా చేసే వాహనాలే కారణమంటున్న స్థానికులు
వంద టన్నుల బరువుతో గ్రానైట్ శిలలు తరలింపు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
మూడు జిల్లాల ప్రజలకు రవాణా కష్టాలు
చోడవరం, డిసెంబరు 21: చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలోని భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో వంతెనలు, కల్వర్టులు ఒక్కటొక్కటిగా కూలిపోతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మితం కావడం, ఏళ్ల తరబడి నిర్వహణ కొరవడడంతో వంతెనలు బలహీనంగా మారుతున్నాయి. సామర్థ్యానికి మించి అధిక బరువుతో భారీ వాహనాలు వెళుతుండడం, వంతెనల పిల్లర్లకు సమీపంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో ప్రమాదకరంగా మారి వంతెనలు కుంగి, కూలిపోతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను వేరే మార్గాల్లోకి మళ్లిస్తుండడంతో ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలకు చేరువాల్సి వస్తున్నది.
బీఎన్ రోడ్డులో చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల సరిహద్దులో వున్న బొడ్డేరు వంతెన తొమ్మిదేళ్ల క్రితం కూలిపోయింది. దీంతో శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలంటూ వివిధ పార్టీల నేతులు, స్థానికులు ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. తరువాత, చోడవరం నుంచి దేవరాపల్లి వెళ్లే రోడ్డులో గవరవరం వద్ద శారదా నదిపై భారీ వంతెన కూలిపోయింది. గత ఏడాది మే నెలలో బీఎన్ రోడ్డులో వడ్డాది వద్ద పెద్దేరు నదిపై వున్న వంతెన కొంతభాగం కుంగిపోయంది. ఈ నెల 7వ తేదీన తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో బుచ్చెయ్యపేట మండలం వడ్డాది- బంగారుమెట్ట జంక్షన్ మధ్య కల్వర్టు కొట్టుకుపోయి రోడ్డు మొత్తం భారీ గొయ్యి ఏర్పడింది. తాజాగా బుధవారంనాడు బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజు పేట వద్ద తాచేరు వంతెన కూలిపోయింది. కూలిన వంతెనల స్థానంలో ప్రత్యామ్నాయంగా కల్వర్టులు లేదా కొత్త వంతెనలు నిర్మించే వరకు ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అదే బాటలో గోవాడ వంతెన!
బీఎన్ రోడ్డులో ప్రధానమైన గోవాడ వద్ద వంతెన కూడా ప్రమాదభరితంగా మారింది. 1960లో నిర్మించిన ఈ వంతెన కాలక్రమంలో శారదా నది వరద ప్రవాహ ఉధృతితోపాటు వంతెనకు సమీపంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల కారణంగా పిల్లర్లు బలహీనంగా తయారయ్యాయి. దీనికితోడు వంద టన్నుల బరువుతో గ్రానైట్ రాళ్లను రవాణా చేసే ట్రాలర్లు ఈ వంతెన మీదుగా వెళుతుండడంతో ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన కూలిపోతే విశాఖపట్నం, అనకాపల్లి వైపు నుంచి చోడవరం, మాడుగులతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు స్తంభించే ప్రమాదం వుంది.
చోడవరం- పీఎస్‌పేట రోడ్డులో జన్నవరం వంతెన పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పెద్దేరు నదిపై సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెనకు నిర్వహణ పనులు కొరవడ్డాయి. నదిలో వరద ఉధృతికి పిల్లర్ల వద్ద మట్టి కోతకు గురై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. భారీ వాహనాలు వెళుతుంటే.. వంతెనపై ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో వంతెన కూలిపోతుందేమోనని స్థానకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల నుంచి బుచ్చెయ్యపేట, రావికమతం మీదుగా రోలుగుంట, నర్సీపట్నం వెళ్లేందుకు, ఇటు కన్నంపాలెం మీదుగా అనకాపల్లి, కశింకోట వెళ్లేందుకు జన్నవరం వంతెన ఎంతో కీలకమైనది. నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ముఖ్యమైన వంతెన విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కల్వర్టులదీ అదే పరిస్థితి
బీఎన్ రోడ్డు కల్వర్టులు కూడా శిథిలావస్థకు చేరి బలహీనంగా మారాయి. చోడవరం,-వెంకన్నపాలెం మద్యలో రెండు కల్వర్టులు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చోడవరం సమీపంలో విశాఖ డెయిరీ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ వద్ద కల్వర్టు పూర్తిగా బలహీనపడి రేపో మాపో అన్నట్టుగా వుంది. కొత్త కల్వర్టులు నిర్మించి ప్రమాదాలను ముందుగానే నివారించాలని డిమాండ్ చేస్తూ, సీపీఐ. సీపీఎం, జనసేన పార్టీల నేతలు, వెంకన్నపాలెం గ్రామస్థులు పలుమార్లు ఆందోళలు నిర్వహించారు. అయినప్పటికీ వైసీపీ పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారుల్లో కనీస స్పందన లేదు.
గ్రానైట్ లారీలే కారణం
జిల్లాలో ఎక్కడా లేని విధంగా బీఎన్ రోడ్డులో చోడవరం నియోజకవర్గంలో మాత్రమే వంతెనలు, కల్వర్టులు కుంగిపోయి కూలిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా గ్రానైట్ రాళ్లను రవాణా చేసే ట్రాలర్లు, లారీలే కారణం అన్న విషయం ఇటు అధికారులకు, అటు ప్రజాప్రతినిధులకు తెలుసు. కానీ ఈ మార్గంలో గ్రానైట్ రాళ్ల రవాణాను కట్టడి చేయడంలేదు. రావికమతం, మాడుగుల మండలాల్లో పలు గ్రానైట్ క్వారీలు వున్నాయి. ఇక్కడి నుంచి రోజూ రాత్రి 10 గంటల తరువాత నుంచి తెల్లవారుజాము వరకు పదుల సంఖ్యలో భారీ వాహనాల్లో గ్రానైట్ రాళ్లను తరలిస్తుంటారు. ఒక్కో ట్రాలర్‌పై రవాణా చేసే గ్రానైట్ శిలల బరువు 80 నుంచి 120 టన్నుల వరకు వుంటుందని అంచనా. వాస్తవంగా విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వున్న వంతెన సామర్థ్యం 40 టన్నులు మాత్రమే. కానీ ఇంతకు మూడు నుంచి నాలుగు రెట్ల బరువుతో గ్రానైట్ శిలలను రవాణా చేసే వాహనాలు వంతెన మీదుగా వెళుతుండడంతో బలహీనంగా మారి బుధవారం కూలిపోయింది. అంతకుముందు 2015వ సంవత్సరంలో పొట్టిదొరపాలెం, బొడ్డేరు వంతెనలు, గత ఏడాది మే నెలలో వడ్డాది వంతెన కూలిపోయాయి. ఇక మిగిలింది గోవాడ వంతెన మాత్రమే! గ్రానైట్ శిలల రవాణాను అడ్డుకోకపోతే ఇది కూడా కూలిపోయే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.