భూములు బీడు.. అన్నదాతలు గోడు!

ABN , First Publish Date - 2023-08-26T00:22:24+05:30 IST

వర్షాభావ పరిస్థితులు అన్నదాతల్లో కలవరం పుట్టిస్తున్నాయి. జోరువానలు కురవాల్సిన సమయాల్లో వేసవిని తలపించేలా వాతావరణం నెలకొనుటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఫలితంగా ఖరీఫ్‌లో పంట వేసుకునే అవకాశాలు కనిపించకపోవడంతో పలువురు రైతులు ఈ ఏడాది బతుకు దెరువు కోసం వలసలు వెళ్లే పరిస్థితులు దాపురిస్తు న్నాయి.

భూములు బీడు.. అన్నదాతలు గోడు!
వర్షాలు లేక రామన్నపాలెంలో బీడు భూములుగా దర్శనమిస్తున్న పంటలు

నాతవరం మండలంలో తాండవ రిజర్వాయర్‌ నీరు చేరని మూడు పంచాయతీల్లో ప్రారంభం కాని పొలం పనులు

వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులు 8 ప్రభుత్వం ఆదుకోకుంటే వలస బాట తప్పదని ఆందోళన

నాతవరం, ఆగస్టు 25 : వర్షాభావ పరిస్థితులు అన్నదాతల్లో కలవరం పుట్టిస్తున్నాయి. జోరువానలు కురవాల్సిన సమయాల్లో వేసవిని తలపించేలా వాతావరణం నెలకొనుటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఫలితంగా ఖరీఫ్‌లో పంట వేసుకునే అవకాశాలు కనిపించకపోవడంతో పలువురు రైతులు ఈ ఏడాది బతుకు దెరువు కోసం వలసలు వెళ్లే పరిస్థితులు దాపురిస్తు న్నాయి. నాతవరం మండలంలో సరుగుడు, వైడీపేట, సుందరకోట పంచాయతీలకు తాండవ రిజర్వాయర్‌ నీరు వెళ్లదు. మిగతా పంచాయతీలలో పంటపొలాలకు తాండవ రిజర్వాయర్‌ నీరు ఆగస్టు పదో తేదీన విడుదల చేయడంతో ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. వైడీపేట, సరుగుడు, సుందరకోట పంచాయతీలలో సుమారు ఏడు వందల ఎకరాల వరకు సాగుభూములున్నాయి. చెరువులలో నీరు లేకపోవడమే కాకుండా కొండల నుంచి వచ్చే ఊట గెడ్డలు కూడా అడుగంటడంతో వరినాట్లు వేసుకునే అవకాశం లేకపోతోంది. దీంతో ప్రతి ఏడాది ఈ పంచాయతీలలో ఇప్పటికే వరినాట్లు వేసుకునే రైతులు ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

పంటపొలాలు బీడు భూములుగా మారుతుండడాన్ని చూసి కలవరపడుతున్నారు. పంటలు పండించకపోతే తమకు తిండికి కష్టంతో పాటు గ్రాసం లేకపోతే పశువులను మేపడం కూడా కష్టమేనని అంటున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వైడీపేట, సుందరకోట, సరుగుడు గ్రామాలలో పర్యటించి పంట వేయలేని రైతులను గుర్తించి ఈఏడాది బతుకుబాట సాగించేందుకు ఏదో రూపంలో ఆదుకోవాలని ఆయా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే పిల్లాపాపలతో ఇతర ప్రాంతాలకు బ్రతుకుతెరువు కోసం వలసబాట పట్టక తప్పదని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2023-08-26T00:22:24+05:30 IST