బ్యాటరీ వెహికల్ మరింత దూరం రయ్..రయ్...
ABN , First Publish Date - 2023-03-02T01:00:51+05:30 IST
ఇక్కడి డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు.
అనకాపల్లి టౌన్, మార్చి 1 : ఇక్కడి డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలక్ర్టిక్ వెహికల్ బ్యాటరీ చార్జింగ్ ప్రాజెక్టును రూపొందించారు. ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వాహనం వెళ్తున్నప్పుడు బ్యాటరీ చార్జింగ్ అయ్యేలా ప్రాజెక్టును తయారు చేశారు. ప్రస్తుత కాలంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఎలక్ర్టిక్ వాహనాలపై మక్కువ పెంచుకుంటున్నారు. ఈ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యం కాదు. చార్జింగ్ స్టేషన్లు కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయి. బ్యాటరీ చార్జింగ్ అవడానికి సమయం వృథా అవుతుంది. తాము తయారుచేసిన ఈ పరికరం ఇటువంటి వాహనాలకు ఎంతో ఉపయోగపడుతుందని సదరు విద్యార్థులు తెలిపారు. ఎలక్ర్టో మాగ్నెటిక్ విధానాన్ని ఉపయోగించి ఎలక్ర్టిక్ వాహనాలు వెళ్తున్నప్పుడు ఆటోమెటిక్‌గా చార్జింగ్ అయ్యేలా రూపొందించామన్నారు. తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యమవుతుందని ప్రాజెక్టు గైడ్ షేక్ షబీనా తెలిపారు. ప్రాజెక్టు ఇంజినీర్ భమిడిపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో విద్యార్థులు బొద్దపు కుమార్, ఎన్నేటి శ్రీలక్ష్మి, కె. తులసీ, కాజులూరి తులసీ ఈ ప్రాజెక్టును తయారు చేశారు. కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.నరసింహం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వైకుంఠరావు, హెచ్‌వోడీ డాక్టర్ పి.పూర్ణప్రియ తదితరులు సదరు విద్యార్థులను అభినందించారు.