బార్‌ల బరితెగింపు
ABN , First Publish Date - 2023-09-20T00:59:10+05:30 IST
నగరంలో బార్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా నిర్వహణ
24 గంటలూ మద్యం విక్రయం
కొన్నిచోట్ల ఉదయం ఆరు గంటలకే ప్రారంభం
అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా గుట్టుగా అమ్మకం
కౌంటర్ సేల్స్ చే యకూడదన్న నిబంధన బేఖాతరు
మద్యం మత్తులో గొడవలు...హత్యలు
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో బార్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఉదయం ఆరు గంటల నుంచే షట్టర్లు ఎత్తి విక్రయాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మెయిన్ షట్టర్ దించినా పక్కనున్న ప్రత్యేక కౌంటర్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. బార్‌ల నిర్వహణకు అధికారులు విధించిన నియమ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు గానీ పోలీసులు గానీ అటు వైపు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జీవీఎంసీ పరిధిలో 120 బార్లు ఉన్నాయి. వీటిని ఉదయం పది నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలి. అదే రెస్టారెంట్ వుంటే మాత్రం రాత్రి 12 వరకూ విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం ఉంది. బార్‌లో కేవలం...అక్కడ కూర్చుని తాగే వారికే మాత్రమే మద్యం విక్రయించాలి. అంతేగానీ కౌంటర్ సేల్స్ (బాటిళ్లను బయటకు విక్రయించడం) చేయకూడదు. ఏదైనా బార్ సమయపాలన పాటించకుండా విక్రయాలు చేసినా, కౌంటర్ సేల్స్ జరిపినా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు కేసులు నమోదుచేసి జరిమానా విధించవచ్చు. ఒకవేళ రెండోసారి కూడా అలాంటి ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడితే బార్‌ను సీజ్ చేసి లైసెన్స్‌ను రద్దు చేసే అధికారం ఉంటుంది. కానీ నగరంలో చాలా బార్‌లు వేళలు పాటించడం లేదు. అలాగే బ్రాండ్ మిక్సింగ్‌లు, కౌంటర్ సేల్స్ వంటివి చేస్తున్నాయి. వీటిపై కేసులు నమోదుచేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోంది. అక్కడ పరిమిత బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో మందుబాబులు తమకు కావాల్సిన బ్రాండ్ కోసం బార్‌లకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటోంది. ఇది బార్‌ల నిర్వాహకులకు అవకాశంగా మారింది. సమయపాలనతో పనిలేకుండా ఉదయం ఆరు గంటలకే బార్‌లను తెరిచి విక్రయాలు చేస్తున్నారు. ఆ సమయంలో బార్‌లో ఇతర సిబ్బంది ఎవరూ ఉండరు. కేవలం కౌంటర్ సేల్స్ ద్వారానే విక్రయాలు చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. ప్రతి బార్ నుంచి అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బార్‌లలో అత్యధికం అధికార పార్టీకి చెందిన వారివి కావడంతో వారితో పెట్టుకోవడం ఎందుకనే భావనతో అధికారులు వారు ఇచ్చింది తీసుకుని చూసీచూడనట్టు ఊరుకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలతోపాటు ఎంవీపీ కాలనీ, శివాజీపాలెం, అక్కయ్యపాలెం, రైల్వే న్యూకాలనీ వంటి ప్రాంతాల్లోని బార్‌ల వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఉదయం ఆరు గంటలు వరకూ ప్రత్యేక కౌటర్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు.
ఇక బార్‌ల లోపల, బయట మందుబాబులు ఘర్షణ పడుతుంటారు. ఇవి ఒక్కొక్కసారి హత్యలకు దారితీస్తున్నాయి. కొన్నాళ్ల కిందట ఎంవీపీ కాలనీ సెక్టార్-7లోని ఒక బార్‌లో మద్యం సేవిస్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే తాటిచెట్లపాలెం బజారులో ఉన్న బార్‌లో మద్యం సేవిస్తున్న స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఒకరిని హత్య చేశారు. ఇంకా సత్యం కూడలిలోని ఒక బార్‌లోనూ, పెదవాల్తేరులోని మరొక బార్‌లోనూ హత్యలు జరిగాయి. ఇటీవల కాలంలో బార్‌లు హత్యలు, కొట్లాటకు కేంద్రాలుగా మారిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులు హత్యకు సంబంధించిన నేరంపై కేసు నమోదుచేసి శాఖాపరమైన దర్యాప్తు చేసుకుంటున్నారు. బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు అప్పటికప్పుడు కాస్త హడావిడి చేసి తర్వాత ఊరుకుంటున్నారు. నిబంధనలు పాటించని బార్‌ల నిర్వాహకులపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు కూడా ఉన్నప్పటికీ నెలవారీ మామూళ్లు అందడం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదు.