బార్ లలో కల్తీ జోరు
ABN , First Publish Date - 2023-11-06T00:38:26+05:30 IST
జిల్లాలోని కొన్ని బార్‌ల్లో మద్యం కల్తీ జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రాండెడ్ మద్యంలో తక్కువ రకం కలుపుతున్న వైనం
కొన్ని ప్రాంతాల్లో అక్రమాలకు తెరతీస్తున్న సిబ్బంది
రద్దీవేళల్లో మోసానికి పాల్పడుతున్న పరిస్థితి
నిఘా పెడితే అక్రమార్కుల గుట్టురట్టు
తరచూ దాడులు చేస్తామంటున్న ఎక్సైజ్ అధికారులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కొన్ని బార్‌ల్లో మద్యం కల్తీ జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైన మద్యంలో తక్కువ ధర గల మద్యం కలిపి సరఫరా చేసేస్తున్నారని .మందుబాబులు లబోదిబోమంటున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ, దాడులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 125 బార్‌లు ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలు వరకూ బార్లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు రాత్రి 12 గంటలు వరకూ విక్రయాలు సాగించుకోవచ్చు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పరిమితమైన బ్రాండ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ప్రీమియం బ్రాండ్‌లు కావాలంటే ఎవరైనా బార్‌లను ఆశ్రయించాల్సిందే. దీనికితోడు బార్‌లో కూర్చొని మద్యం సేవిస్తే స్నేహితులతో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకోవడంతోపాటు ప్రశాంత వాతావరణం ఉంటుందని భావిస్తుంటారు. దీంతో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ బార్‌లన్నీ మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి.
రద్దీ వేళల్లో చేతివాటం
కొన్నిబార్‌ల నిర్వాహకులు, సిబ్బంది రద్దీ సమయాన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ సమయంలో బార్‌లో ఖరీదైన మద్యం ఆర్డర్ చేసేవారికి కొంత పరిమాణంలో తక్కువ ధర మద్యం కలిపి సరఫరా చేస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఆహారంతో పాటు మద్యం సేవించడం వల్ల మందుబాబులు అంత సులభంగా కల్తీని గుర్తించేందుకు అవకాశం ఉండదని, పైగా ఎక్కడో కూర్చొని మద్యం ఆర్డర్ చేస్తే సిబ్బంది కౌంటర్ వద్దకు వెళ్లి గ్లాసుల్లో మద్యం పోసి సర్వ్ చేస్తుంటారని చెబుతున్నారు. దీనివల్ల మద్యం కల్తీ చేస్తే మద్యం ప్రియులు గమనించే అవకాశం ఉండదంటున్నారు.
కాగా నగరంలోని కొన్నిబార్లలో విచ్చలవిడిగా మద్యం కల్తీచేస్తున్నారంటూ గతకొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీపై దృష్టిసారించి ఆకస్మిక తనిఖీలు జరిపితే మోసాలు బట్టబయలవుతాయని, కానీఆదిశగా దృష్టి సారించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వెలుగుచూస్తున్న కేసులు
ఈ ఏడాది ఇప్పటివరకూ ఎక్సైజ్ అధికారులు పది బార్‌అండ్ రెస్టారెంట్‌లపై పలు ఉల్లంఘనల కింద కేసులు నమోదుచేయగా, అందులో మద్యం బ్రాండ్ మిక్సింగ్ కేసులు నాలుగు మాత్రమే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బార్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పాటి ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇస్తుండడంతోపాటు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఇండెంట్లు పెట్టినా కాదనకుండా చేసిపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అఽధికారులు నిర్వాహకులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బార్లలో బ్రాండ్ మిక్సింగ్ ఆరోపణలపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్ వద్ద ప్రస్తావించగా, రద్దీ సమయాల్లోనే బ్రాండ్ మిక్సింగ్‌కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. అయితే దీనిని గుర్తిం, పట్టుకోవడం కాస్త క్లిష్టమవుతోందన్నారు. కేసు నమోదుచేయాలంటే కౌంటర్‌లో మద్యం కల్తీ చేసి, వినియోగదారుడికి సరఫరా చేసే సందర్భంగా గుర్తించి, ఆ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ తరచూ బార్‌లపై దాడులు చేయడంతోపాటు కల్తీపై నిఘా పెంచుతామన్నారు.