Share News

ఆటకు దూరం!

ABN , First Publish Date - 2023-12-11T01:10:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి యువత నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు.

ఆటకు దూరం!

ఆడుదాం ఆంధ్రపై ఆసక్తి చూపని యువత

ఆటగాళ్లు, ప్రేక్షకుల రిజిస్ర్టేషన్‌ బాధ్యతలు వలంటీర్లకు అప్పగింత

ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో డ్వాక్రా రీసోర్స్‌ పర్సన్స్‌కు బాధ్యతలు

ఈ నెల 13 వరకు రిజిస్ర్టేషన్లకు అవకాశం.. 15 నుంచి క్రీడలు ప్రారంభం

వలంటీర్లు, రీసోర్స్‌ పర్సన్స్‌ కో-ఆర్డినేషన్‌ బాధ్యత సచివాలయ సిబ్బందిదే

యువత ముందుకు రాకపోవడంతో తల పట్టుకుంటున్న వలంటీర్లు, ఆర్పీలు

విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి యువత నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇది వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ప్రతి గ్రామం/వార్డు పరిధిలో 220 మంది ఆటగాళ్లు, మరో 200 మంది ప్రేక్షకులను రిజిస్టర్‌ చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనేకచోట్ల లక్ష్యం చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. నాలుగున్నరేళ్లుగా క్రీడాభివృద్ధిని పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావిడి చేయడం పట్ల యువత ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావడం లేదు.

ఈ నెల 15 నుంచి జనవరి 26 వరకు జరగనున్న ఆటల్లో పాల్గొనాలంటే ముందుగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. ఈ బాధ్యతను మొదట వలంటీర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఒక్కో వలంటీర్‌ 20 మంది ఆటగాళ్లను, మరో 20 మంది ప్రేక్షకులను యాప్‌లోని ఆడుదాం ఆంధ్ర పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయాలని నిర్దేశించింది. అయితే, అనేక చోట్ల వలంటీర్లు లక్ష్యాలను చేరుకోలేదు. కనీసం ఐదు నుంచి పది మందిని కూడా రిజిస్టర్‌ చేయించలేకపోయారు. మరో వారంలో ఆటలు ప్రారంభించాల్సిప దశలో కనీస స్థాయిలో ఆటగాళ్లను రిజిస్టర్‌ చేయకపోవడం పట్ల ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన్లు చేయకపోతే వేతనాలు నిలిపేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ వలంటీర్లు చేతులెత్తేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బాధ్యతలను రెండు రోజుల కిందట స్వయం సహాయక సంఘాలను పర్యవేక్షించే రీసోర్స్‌ పర్సన్స్‌కు అప్పగించారు. ప్రతి రీసోర్స్‌ పర్సన్‌ 50 నుంచి 100 మంది ఆటగాళ్లు, ప్రేక్షకులను రిజిస్ర్టేషన్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఒకపక్క వలంటీర్లు, మరోపక్క ఆర్పీలు... ఆడుదాం ఆంధ్ర రిజిస్ర్టేషన్లలో నిమగ్నమై ఉన్నారు. తమకు ఇచ్చిన లక్ష్యాల్లో కొంతవరకైనా చేరుకునేందుకు ఆర్పీలు తమ పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారి పిల్లలను రిజిస్టర్‌ చేస్తున్నారు. పిల్లలు అంగీకరించకపోతే వారి తల్లిదండ్రులతో ఒత్తిడి చేయిస్తున్నారు. రెండు రోజుల్లో కనీసం 50 మందిని అయినా రిజిస్టర్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఆర్పీలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చుచేసి క్రీడా సామగ్రిని కొనుగోలు చేశామని, ఆడేందుకు ఆటగాళ్లు లేకపోతే పరువుపోతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజులు చూసి ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన్లు లేకపోతే పార్టీ నేతలను రంగంలోకి దించే అవకాశముందని చెబుతున్నారు. వారే దగ్గరుండి ప్రక్రియను నిర్వహించే ప్రయత్నం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-12-11T01:10:03+05:30 IST