ఏటికొప్పాక హస్త కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ

ABN , First Publish Date - 2023-01-26T01:15:35+05:30 IST

హస్తకళా రంగానికి ఆయన జీవం పోశారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు జాతీయ స్థాయి గుర్తింపు తెచారు. మూడు దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తున్న ఆయన తన కళానైపుణ్యతతో అందరినీ ఆకట్టుకున్నారు. అంకుడు కర్రతో అనేక అద్భుత కళాఖండాలను సృష్టించారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రకృతి సహజ సిద్ధమైన రంగులను అద్ది జీవ కళ ఉట్టిపడేలా రూపొందించారు. ఆయనే చింతలపాటి వెంకటపతిరాజు... ఏటికొప్పాకలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మూడున్నర దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తున్నారు. సొంతూరులో హస్తకళా నిలయాన్ని ఏర్పాటు చేసి, కళకు ఎనలేని సేవలు అందిస్తున్నారు.

ఏటికొప్పాక హస్త కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ
చింతలపాటి వెంకటపతిరాజు, ఏటికొప్పాక, ఎలమంచిలి మండలం

హస్త కళారంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రకటన

అనకాపల్లి/ ఎలమంచిలి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

హస్తకళా రంగానికి ఆయన జీవం పోశారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు జాతీయ స్థాయి గుర్తింపు తెచారు. మూడు దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తున్న ఆయన తన కళానైపుణ్యతతో అందరినీ ఆకట్టుకున్నారు. అంకుడు కర్రతో అనేక అద్భుత కళాఖండాలను సృష్టించారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రకృతి సహజ సిద్ధమైన రంగులను అద్ది జీవ కళ ఉట్టిపడేలా రూపొందించారు. ఆయనే చింతలపాటి వెంకటపతిరాజు... ఏటికొప్పాకలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మూడున్నర దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తున్నారు. సొంతూరులో హస్తకళా నిలయాన్ని ఏర్పాటు చేసి, కళకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. సరికొత్త ఆవిష్కరణలతో అందరినీ అలరించడమే కాకుండా ఈ వృత్తిలో ఎందరినో ప్రోత్సహించారు. ఏటికొప్పాక హస్తకళాఖండాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2002లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ చేతుల మీదుగా అవార్డు పొందారు. నాటి నుంచి నేటి వరకు అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2020 ఆగస్టులో ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో హస్తకళారంగం గురించి వివరించారు. గత ఏడాది డిసెంబరులో కంబోడియా దేశంలో పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ, ఏటికొప్పాక హస్తకళాఖండాల గురించి వివరించారు. హస్తకళల్లో అంచెలంచెలుగా ఎదిగిన చింతలపాటి వెంకటపతిరాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికచేసింది.

హస్తకళకు దక్కిన అరుదైన గౌరవం: సీవీ రాజు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురాస్కారానికి ఎంపిక కావడం హస్తకళారంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ పురస్కారం నాకుఏ దక్కడం చాలా గొప్ప విషయం. ఈ పురస్కారంతో ఏటికొప్పాక హస్తకళారంగానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుంది.

Updated Date - 2023-01-26T01:15:36+05:30 IST