ఆక్రమణల తొలగింపుపై ఏపీఐఐసీ తాత్సారం
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:11 AM
అధికారంలో ఉండగానే అందినంత దోచుకోవాలని వైసీపీ నాయకులు యత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రహరీ నిర్మించేసిన అక్రమార్కులు
మొత్తం భూమి విలువ రూ.12 కోట్లు
తెర వెనుక మంత్రాంగం నడుపుతున్న మంత్రి?
అధికారులకూ భారీగా ముడుపులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
అధికారంలో ఉండగానే అందినంత దోచుకోవాలని వైసీపీ నాయకులు యత్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓ మంత్రి ఏపీఐఐసీ భూములపై కన్నేశారు. తాను చెప్పినట్టు వినే అధికారులతో దువ్వాడ రైల్వేస్టేషన్ మార్గంలో ఏపీఐఐసీకి చెందిన సుమారు 97 సెంట్లు భూమిలో సొంతవర్గాన్ని దించారు. వారితో భూమి చుట్టూ ప్రహరీ కట్టించారు. రోడ్డు వేయించారు. ఇది దువ్వాడ సర్వే నంబరు 123లో ఉంది. ఆ భూమితో సహా ఏపీఐఐసీకి అక్కడ మొత్తం 39 ఎకరాలు ంది. అంత పెద్ద భూమిలో కొంత ఆక్రమిస్తే ఎవరు గుర్తిస్తారులే? అనుకున్నారు. దాని పక్కనే 108/5లో కూడా ఏపీఐఐసీకి కొంత భూమి ఉంది. ఆక్రమణదారులు అందులో కూడా ప్రహరీ నిర్మించారు. ఈ వ్యవహారం అంతా ఏపీఐఐసీ అధికారుల సమ్మతితోనే జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఏపీఐఐసీ అధికారులు అది తమ భూమి కాదని, స్టీల్ ప్లాంటుదని తోసిపుచ్చారు. అయితే రెవెన్యూ అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వేలో అది ఏపీఐఐసీ భూమి అని తేలింది.
ఇక్కడ గజం విలువ రూ.25 వేలు ఉంది. మొత్తం ఆక్రమిత భూమి విలువ సుమారు రూ.12 కోట్లు. ఇదంతా జరిగిమూడు వారాలు అవుతోంది. ఈ ఆక్రమణపై ఈ నెల 23న ’’ఆంధ్రజ్యోతి’’ కథనం ప్రచురించింది. ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడితే ఆక్రమణలు తొలగిస్తామన్నారు. వారం గడిచినా దృష్టి సారించలేదు. ఆక్రమణను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో సదరు వ్యక్తి రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన బోర్డులు మాత్రం తొలగించారు. ప్రహరీ కూల్చలేదు. భూమిని స్వాధీనం చేసుకోలేదు. దీనిపై ఏపీఐఐసీ అధికారులు వితండ వాదం చేస్తున్నారు. మీరు పత్రికల్లో రాస్తే మేము చర్యలు తీసుకోవాలా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఓ మంత్రి హస్తం ఉండడంతోనే అధికారులు చర్యలు చేపట్టడం లేదని సమాచారం. వారం రోజుల్లో అక్కడి ప్రహరీ కూలగొట్టి, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టకపోతే.. తాము కూడా రెండు ఎకరాలు ఆక్రమిస్తామని, ఎవరు వస్తారో చూస్తామని స్థానిక నాయకులు అంటున్నారు. ముడుపులు అందుకున్న అధికారులు అందులో కూడా వాటాలు అడుగుతారా? చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాలి.