మరో రహదారి విస్తరణ
ABN , First Publish Date - 2023-09-26T01:30:44+05:30 IST
వన్‌టౌన్‌లో రీడింగ్ రూమ్ నుంచి విక్టోరియా జనరల్ ఆస్పత్రి (ఘోషాసుపత్రి) మీదుగా బీచ్ వరకు రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

రీడింగ్ రూమ్ నుంచి వీజీహెచ్ మీదుగా బీచ్‌కు 60 అడుగుల రోడ్డు
అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల్లోగా తెలియజేయాలంటూ ప్రకటన విడుదల చేసిన జీవీఎంసీ
ఇప్పటికే మార్కింగ్ చేసిన సిబ్బంది
వన్‌టౌన్ మెయిన్ రోడ్డులో పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలు
ఇక్కడ ఏమి చేస్తారో...స్థానికుల్లో ఆందోళన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వన్‌టౌన్‌లో రీడింగ్ రూమ్ నుంచి విక్టోరియా జనరల్ ఆస్పత్రి (ఘోషాసుపత్రి) మీదుగా బీచ్ వరకు రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రహదారి ప్రస్తుతం 20 అడుగులు ఉంది. దీనిని 60 అడుగులకు విస్తరించనున్నారు. వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్-2041 ప్రకారం ఈ మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించినట్టు జీవీఎంసీ ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా జారీచేసింది. ఈ మార్గం విస్తరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల్లోగా తెలియజేయాలని స్పష్టంచేసింది. ఎటువంటి అభ్యంతరాలు రాకుంటే పనులు ప్రారంభిస్తామని స్పష్టంచేసింది. అయితే ఈ ప్రకటన జారీకి ముందే ఆ మార్గంలో భవనాలకు మార్కింగ్ చేయడం గమనార్హం.
అవసరమే కానీ...పరిహారాలు ఏవీ..?
నగరంలో పెరుగుతున్న అవసరాల మేరకు రహదారులను విస్తరించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని సేకరిస్తే పరిహారం ఇవ్వాలి. విస్తరణలో పోయే స్థలానికి పరిహారం బాధితులు ఇప్పించాలని కోరుతున్నారు. ఇక్కడే జీవీఎంసీ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఇలాంటి వాటికి నిధులు ఇవ్వడం లేదని చెబుతోంది. నాలుగు నెలల క్రితం జగదాంబ జంక్షన్ నుంచి క్వీన్ మేరీ స్కూల్ వరకు మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో అన్నీ వ్యాపార సంస్థలు కావడంతో వారంతా వ్యతిరేకించారు. పరిహారం కోరారు. రూపాయి కూడా ఇచ్చేది లేదని జీవీఎంసీ అధికారులు స్పష్టంచేసి కూల్చివేతలు ప్రారంభించారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ప్రభుత్వ పెద్దల్లాగే అధికారులు కూడా వ్యక్తిగత కక్షలు పెట్టుకొని కేసులు వేసిన వారిని వేధించారు. వారికి వేరే నోటీసులు ఇవ్వడం, ఇతరత్రా వ్యాపారాలు ఉంటే వాటి లొసుగులు బయటకు తీయడం వంటి చర్యలకు దిగారు. దాంతో వారంతా వెనకడుగు వేశారు.
పాత భవనాలని కూల్చివేత నోటీసులు
విస్తరణ అంటే పరిహారం అడుగుతున్నారని అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. అక్కడ అన్నీ పురాతన భవనాలని, వర్షాలకు కూలిపోతాయంటూ ప్రత్యేకంగా సర్వే చేసి 250 భవనాలకు కూల్చేయాలని నోటీసులు ఇచ్చారు. అలాంటి భవనాల స్థలం ఏదైనా తీసుకుంటే...వాటికి టీడీఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడే అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. పాత భవనాలు కాబట్టి కూల్చివేయాలన్నారు. అలా ఎవరైనా కూల్చివేసుకుంటే మళ్లీ కొత్తగా నిర్మించుకునే అవకాశం ఉంది. అలాంటి వాటికి అనుమతులు ఇవ్వడం లేదు. కచ్చితంగా రహదారికి ఇవ్వాలని, టీడీఆర్ తీసుకోవాలని అంటున్నారు. ఇలా ఎవరికైనా టీడీఆర్ ఇవ్వాలంటే..ఆ స్థలాన్ని జీవీఎంసీకి రిజిస్టర్ చేయాలి. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ఆ ఖర్చుల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక్కడ జీవీఎంసీ అధికారులు కక్ష గట్టి, ఆ మినహాయింపు ఇవ్వకుండా సొంత ఖర్చులతో రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. రహదారి విస్తరణకు ఎవరైనా పొరపాటున అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారు. కనీసం నిర్మాణానికి అయిన పరిహారమైనా ఇవ్వడం లేదని, ఇది చాలా అన్యాయమని స్థానికులు వాపోతున్నారు.
ఓ సంఘ నాయకుడికి ఛైర్మన్ పదవి
ప్రధాన రహదారిని నాలుగు నెలల క్రితం విస్తరించినప్పుడు వన్‌టౌన్‌లో బంగారం వర్తకుల తరపున ఆ సంఘం నాయకుడు మారోజు శ్రీనివాసరావు వ్యతిరేకించారు. తమ వ్యాపారాలు పోతాయని అధికారులతో వాదించారు. దాంతో అధికార పార్టీ ఆయన్ను పిలిచి మాట్లాడుకుంది. జగన్నాథ స్వామి రథయాత్ర ముగియగానే ఆ ఆలయానికి ఆయన్ను చైర్మన్‌ను చేసింది. అలాగే ఆయన షాపు మాత్రం వదిలేసి, మిగిలిన షాపులను విస్తరణలో కొంత మేరకు కూల్చివేశారు. ఇదెక్కడి న్యాయమని వ్యాపారులంతా ఘొల్లుమంటున్నారు. అలాగే ఏవీఎన్ కాలేజీ డౌన్‌లో చందు పేరుతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. అధికారులు ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలు వర్తింపజేస్తున్నారు.
కనకమహాలక్ష్మీ ఆలయానికీ ఎఫెక్ట్
తాజాగా రీడింగ్ రూమ్ నుంచి కనకమహాలక్ష్మి ఆలయం, ఘోషాసుపత్రి మీదుగా బీచ్ రోడ్డు విస్తరణ వల్ల ఆలయం భవనాలకు కొంత మేర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే మార్కింగ్ చేశారు. అన్నదాన సత్రం, మండపం వంటివి 12 అడుగుల మేర పోతాయి. అలాగే ఆ ప్రాంతంలో చర్చి, మసీదులు వంటివి ఉన్నాయి. మార్కింగ్ చేసిన అధికారులు ఇంకా నోటీసులు ఇవ్వలేదు.
నర్సీపట్నంలో రూ.32 కోట్లు మంజూరు
వన్‌టౌన్‌లాగే నర్సీపట్నంలో ప్రధాన రహదారిని విస్తరిస్తున్నారు. అక్కడ నిర్మాణాలకు పరిహారం కోసం ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరుచేసింది. అక్కడ వారికి ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉందని, కానీ జీవీఎంసీ అధికారులే దానిని ముందుకు తీసుకువెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.