కదం తొక్కిన అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2023-09-26T00:48:49+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది సోమవారం అనకాపల్లి పట్టణంలో కదం తొక్కారు. తమ సమస్యల పరిష్కారానికి విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్బంధాల కారణంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు.

కదం తొక్కిన అంగన్‌వాడీలు
ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు

అనకాపల్లిలో భారీ ప్రదర్శన

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 25: అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది సోమవారం అనకాపల్లి పట్టణంలో కదం తొక్కారు. తమ సమస్యల పరిష్కారానికి విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్బంధాల కారణంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నెహ్రూచౌక్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ మానవహారంగా ఏర్పడి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మెయిన్‌రోడ్డు మీదుగా నూకాంబిక ఆలయం సమీపంలో ఉన్న ఐసీడీఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, పదోన్నతులు కల్పించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌, వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఒక యాప్‌ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, చివరి నెల వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌ ఇవ్వాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, వంట గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు మాట్లాడుతూ, అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగశేషు, అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి, కోశాధికారి వీవీ రమణమ్మ, నేతలు కాసులమ్మ, జయవెంకటలక్ష్మి, సీఐటీయూ నాయకులు వీవీ శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:48:49+05:30 IST