కదంతొక్కిన అంగన్‌వాడీలు
ABN , First Publish Date - 2023-02-07T00:55:14+05:30 IST
డిమాండ్ సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు రోడ్డెక్కారు. సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

పలు సమస్యలపై నినాదాలు
స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
అనకాపల్లి కలెక్టరేట్, ఫిబ్రవరి 6: డిమాండ్ సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు రోడ్డెక్కారు. సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అధికారుల వేధింపులు ఆపాలని, ముఖ హాజరు ఆదేశాలను రద్దు చేయాలని, వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.కుమారి మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.వెయ్యి అధికంగా జీతాలు ఇస్తానని ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో నాటి ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అంగన్‌వాడీ సిబ్బందిపై అధిక పని భారాన్ని మోపుతున్నాయని అన్నారు. జీతాలు సకాలంలో చెల్లించడంలేదని, పౌష్టికాహారానికి ఖర్చుచేసిన డబ్బులకు సంబంధించిన బిల్లులను నెలలు తరబడి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన ముఖ హాజరు (ఫేషియల్ అటెండెన్స్) ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు-1ని రద్దు చేయాలని, సీనియారిటీ ప్రకారం వేతన స్కేల్ అమలు చేయాలని, సూపర్‌వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని కోరారు. అనంతరం స్పందనలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఐసీడీఎస్ పీడీ ఉషారాణి.. ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చి వారు డిమాండ్లు, సమస్యలను ఆలకించారు. వీటిని తమ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. కాగా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేయనున్నట్టు సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ముందుగానే ప్రకటించడంతో డీఎస్పీ బి.సునీల్ ఆఽధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి, ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.