అంగన్‌వాడీ భవన నిర్మాణాలు నత్తనడక

ABN , First Publish Date - 2023-06-07T00:51:26+05:30 IST

ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదని, పనులను వేగవంతం చేయకపోతే బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ హెచ్చరించారు. ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, నాడు-నేడు పనుల పురోగతిపై సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

అంగన్‌వాడీ భవన నిర్మాణాలు నత్తనడక
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌,

ఏజెన్సీలో 128 భవనాలకు 20 మాత్రమే పూర్తి

పునాదుల స్థాయిలోనే 45 కేంద్రాల భవనాలు

పనులను వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు

అధికారులకు ఐటీడీఏ పీవో అభిషేక్‌ హెచ్చరిక

పాడేరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదని, పనులను వేగవంతం చేయకపోతే బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ హెచ్చరించారు. ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, నాడు-నేడు పనుల పురోగతిపై సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో 128 అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చిన ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. రెండో విడత రివాల్వింగ్‌ ఫండ్‌ జమచేసినప్పటికీ పలుచోట్ల భవన నిర్మాణాలు పునాదుల స్థాయిలోనే ఉన్నాయని, ఇంతవరకు 20 భవనాలు మాత్రమే శ్లాబ్‌స్థాయి వరకు పనులు పూర్తి చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాడేరు నియోజకవర్గంలో 15, అరకులోయ నియోజకవర్గంలో 30 కేంద్రాల భవనాలు ఇంకా పునాదుల స్థాయిలోనే వుండడం శోచనీయమని ఆయన అన్నారు. ఏజెన్సీలో 11 మంది సీడీపీవోలు, 62 మంది సూపర్‌వైజర్లు ఉన్నారని, భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను నియమించిందన్నారు. భవన నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మహిళా పోలీసులు కూడా ఆయా పనుల పురోగతిని పర్యవేక్షించాలని, నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయాలని ఆయన చెప్పారు. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలలకు సిమెంట్‌ సరఫరా చేశారని, అవసరమైతే ఆయా పాఠశాలల నుంచి సిమెంట్‌ తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులకు వినియోగించాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:51:26+05:30 IST