ఇంకా ముంపులోనే వరిచేలు
ABN , First Publish Date - 2023-12-11T00:42:45+05:30 IST
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షాల ప్రభావం నుంచి అన్నదాత ఇంకా తేరుకోలేదు.ఐదురోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయి. మిచౌంగ్ తుఫాన్‌తో రికార్డు స్థాయిలో 21 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదుకావడతో మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.
ధాన్యం మొలకలు వచ్చే ప్రమాదం
అన్నదాతల ఆందోళన
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
బుచ్చెయ్యపేట, డిసెంబరు 10: మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షాల ప్రభావం నుంచి అన్నదాత ఇంకా తేరుకోలేదు.ఐదురోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయి. మిచౌంగ్ తుఫాన్‌తో రికార్డు స్థాయిలో 21 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదుకావడతో మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. వర్షాలు తగ్గినా వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఇంకా నీటిలోనే వరి పనలు నానిపోతున్నారు. దీనికితోడు పెద్దేరు ఉధృతికి వడ్డాది, బంగారుమెట్ట, ఎల్‌బిపీ అగ్రహారం, లోపూడి, చినఅప్పన్నపాలెం, పొలేపల్లి, గంటికొర్లాం, భట్లోవ, కోమళ్లపూడి, నీలకంఠాపురం, తురకలపూడి తదితర గ్రామాల్లో వరిపంట నీటి ముంపులో కుళ్లిపోయే స్థితికి చేరుకుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నేటికీ ప్రభుత్వ పరంగా పంట నష్టంపై ఎటువంటి ఆదేశాలు జారీకాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆర్బీకే వీఏఏలు ముంపుకు గురైయిన పంటలను తూతూ మంత్రంగా పరిశీలించి, ఫొటోలు తీస్తున్నారు. మునిగిన పంట రక్షణ చర్యలను వీఏఏలు రైతులకు సూచిస్తున్నారు. అయితే, బాధిత రైతుల వివరాలను, పంట నష్టాలను పూర్తిస్థాయిలో సేకరించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని, ఆలస్యమయ్యే కొద్దీ నష్టాలు తక్కువగా చూపించే అవకాశం ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.