నూకాంబిక ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

ABN , First Publish Date - 2023-06-09T02:12:54+05:30 IST

స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.

నూకాంబిక ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

శంకుశిలలకు పూజలు చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 8 :

స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మొదటి దశలో మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పనులకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పూజలు చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆలయ ఆవరణలో నిర్మించిన యాగశాలలో వేదపండితులు వాస్తు హోమం నిర్వహించారు. శంకుశిలలకు స్వరూపానందేంద్ర అభిషేకం నిర్వహించారు. నూకాంబిక అమ్మవారు మహిమలుగల తల్లి అని, అటువంటి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ, రూ.10 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, దాడి జయవీర్‌ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, ఉప స్తపతి శ్రీనివాసాచార్యులు, దేవదాయ శాఖ జిల్లా అధికారి ఎస్‌.రాజారావు, ఆలయ ఈవో బండారు ప్రసాద్‌, డీఈ కృష్ణ, కార్పొరేటర్‌ కొణతాల నీలిమ, వైసీపీ నాయకులు దాడి జయవీర్‌, కొణతాల భాస్కరరావు, పీలా రాంబాబు, పీలా శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రి అమర్‌నాథ్‌ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

Updated Date - 2023-06-09T02:12:54+05:30 IST