జిరాయితీ భూముల్లోని ఇసుకపై కన్ను
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:23 AM
మండలంలోని పీపీ అగ్రహారంలో సర్పానదిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూముల్లో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో ఓ కాంట్రాక్టరు దానిపై కన్నేశారు. ఆ భూములను లీజుకు తీసుకుని వాటిలో తవ్వకాలు చేపట్టారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయంటూ దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు.
సర్పానది సమీపంలో ఉండడంతో భారీగా నిల్వలు
రైతుల నుంచి లీజుకు తీసుకుని తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టరు
మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇసుక తరలిస్తాననే నెపంతో పనులు
అడ్డుకున్న రైతులు, టీడీపీ నాయకులు
మాకవరపాలెం, డిసెంబరు 25: మండలంలోని పీపీ అగ్రహారంలో సర్పానదిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూముల్లో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో ఓ కాంట్రాక్టరు దానిపై కన్నేశారు. ఆ భూములను లీజుకు తీసుకుని వాటిలో తవ్వకాలు చేపట్టారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయంటూ దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాలను సోమవారం స్థానిక రైతులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇసుక తరలించాలనే నెపంతో మండలం లోని పీపీ అగ్రహారం జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఓ కాంట్రాక్టరు సిద్ధమయ్యారు. అక్కడి భూములు సర్పానదికి సమీపంలో ఉండడంతో ఇసుక నిల్వలు భారీగా ఉన్నాయి. దీంతో మెడికల్ కాలేజీకి ఇసుక తరలిస్తానంటూ ఆ కాంట్రాక్టర్ ఆ కళాశాల అధికారుల నుంచి లేఖ తెచ్చుకున్నాడు. ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నానంటూ రెవెన్యూ, పోలీసు శాఖకు చెప్పుకొచ్చారు. అక్కడి జిరాయితీ భూములను రైతుల నుంచి లీజుకు తీసుకుని సోమవారం సుమారు 20 ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పీపీ అగ్రహారం నుంచి జి.కోడూరు మీదుగా దారిని ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి లోపల ఉన్న ఇసుకను సేకరించారు. ట్రాక్టరు ఇసుక లోడు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పలకడంతో తవ్వకాలు జోరుగా చేపట్టారు. విషయం తెలిసి ఆ గ్రామానికి చెందిన రైతులు, టీడీపీ నాయకుడు కలిగట్ల బాబూరావు తదితరులు పనులను అడ్డుకున్నారు. దీంతో వారితో కాంట్రాక్టరు వాగ్వాదానికి దిగారు. తనకు అనుమతులు ఉన్నాయని, ఎందుకు అడ్డుకుంటారని గొడవ పడ్డారు. వారి నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో చేసేది లేక ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్లతో అక్కడ నుంచి ఉడాయించారు. దీనిపై తహసీల్దార్ ప్రసాదరావు వివరణ కోరగా ఇసుక తవ్వకాలకు ఎటువంటి ఆనుమతులు ఇవ్వలేదని చెప్పారు. అనుమతులు ఉన్నాయని ఎవరైనా చెబితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కొందరు రైతులు తవ్వకాలు జరుపుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.