మద్యం ఏరులు!

ABN , First Publish Date - 2023-01-18T00:26:54+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చింది. జిల్లాలో మూడు రోజుల్లో రూ.10.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే మూడు రెట్లు అధికం!

మద్యం ఏరులు!
మద్యం విక్రయాలు

మూడు రోజుల్లో ప్రభుత్వానికి రూ.10.5 కోట్ల ఆదాయం

సాధారణ రోజులతో పోలిస్తే మూడు రెట్లు అధికం

గత ఏడాది సంక్రాంతికన్నా రెట్టింపు...!

అనకాపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చింది. జిల్లాలో మూడు రోజుల్లో రూ.10.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే మూడు రెట్లు అధికం!

జిల్లాలో పొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 142 ప్రభుత్వ మద్యం దుకాణాలు, తొమ్మిది రెస్టారెంట్‌ అండ్‌ బార్లు ఉన్నాయి. రోజూ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. శని, ఆదివారాలు, పండుగ దినాల్లో మరికొంచెం ఎక్కువ వుంటుంది. దసరా, సంక్రాంతి పండుగ సమయంలో రెట్టింపు అమ్మకాలు సాగుతుంటాయి. కానీ ఈసారి సంక్రాంతికి రికార్డ్‌స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. శనివారం భోగి పండుగనాడు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.2.2 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ రోజున (ఆదివారం) మరో 50 శాతం వరకు పెరిగి రూ.3.1 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక సోమవారం కనుమ పండుగ రోజున ఏకంగా రూ.5.2 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. మొత్తం మీదు మూడు రోజుల్లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.10.5 కోట్ల ఆదాయం వచ్చింది. పొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు గత ఏడాది సంక్రాంతి పండుగ మూడు రోజులు రూ.5.2 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. సాధారణంగా శని, ఆది, సోమవారాల్లో రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరక మద్యం అమ్మకాలు వుంటాయని, సంక్రాంతి కావడంతో మూడు రెట్లు అధికంగా విక్రయాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగం, ఉపాధి, కూలి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వుంటున్న గ్రామీణులు సంక్రాంతికి తప్పకుండా సొంతూరు వస్తుంటారు. ఎక్కువ మంది సరదాగా గడపడానికి మద్యం సేవిస్తుంటారు. అందువల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి’’ అని పొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారి ఒకరు విశ్లేషించారు.

జూదాలపై పోలీసులు దాడి... 105 మంది అరెస్టు

సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజుల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూదాలు జోరుగా సాగాయి. మరోవైపు పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో దాడులు నిర్వహించి 105 మంది జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1,01,153 నగదు, 47 కోడి పుంజులను స్వాఽధీనం చేసుకున్నారు. మొత్తం 30 కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-01-18T00:26:56+05:30 IST