మళ్లీ నిలిచిన క్రషింగ్
ABN , First Publish Date - 2023-03-05T01:08:20+05:30 IST
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ సవ్యంగా సాగడంలేదు. ఆరు రోజుల క్రితం పంచదార దిగుబడి వచ్చే యూనిట్‌లో ఆఫర్ షాఫ్ట్ విరిగిపోవడంతో 12 గంటల పాటు క్రషింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి మళ్లీ అదే షాఫ్ట్ విరిగిపోవడంతో క్రషింగ్ ఆగిపోయింది. ఇప్పటికే పలు అవాంతరాలతో పడుతూ లేస్తూ నడుస్తున్న గోవాడ షుగర్స్ క్రషింగ్, మరోసారి సాంకేతిక అవరోధంతో నిలిచిపోవడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
గోవాడ్ షుగర్స్‌లో విరిగిపోయిన ఆఫర్ షాఫ్ట్
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి...
యార్డులో భారీగా నిలిచిన చెరకు బండ్లు
ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం
చోడవరం, మార్చి4: గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ సవ్యంగా సాగడంలేదు. ఆరు రోజుల క్రితం పంచదార దిగుబడి వచ్చే యూనిట్‌లో ఆఫర్ షాఫ్ట్ విరిగిపోవడంతో 12 గంటల పాటు క్రషింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి మళ్లీ అదే షాఫ్ట్ విరిగిపోవడంతో క్రషింగ్ ఆగిపోయింది. ఇప్పటికే పలు అవాంతరాలతో పడుతూ లేస్తూ నడుస్తున్న గోవాడ షుగర్స్ క్రషింగ్, మరోసారి సాంకేతిక అవరోధంతో నిలిచిపోవడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
ఫ్యాక్టరీలో గత నెల 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం పంచదార దిగుబడి వచ్చే ప్లాంట్‌లో ఆఫర్ షాఫ్ట్ విరిగిపోవడంతో క్రషింగ్ నిలిపివేశారు. మూతపడిన ఏటికొప్పాక ఫ్యాక్టరీ నుంచి అప్పటికప్పుడు ఆఫర్ షాఫ్ట్ పరిరకాన్ని తీసుకుని వచ్చి మరమ్మతులు చేయడంతో 12 గంటల తరువాత క్రషింగ్ పునఃప్రారంభమైంది. ఇది జరిగి మూడు రోజులు కూడా గడవక ముందే మరోసారి విరిగిపోవడంతో ఫ్యాక్టరీలో యంత్రాల నిర్వహణ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతున్నది. వేరే ఫ్యాక్టరీ నుంచి కొత్త ఆఫర్ షాఫ్ట్‌ను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వారం వ్యవధిలో రెండుసార్లు ఆఫర్ షాఫ్ట్ విరిగిపోయి క్రషింగ్ నిలిచిపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రషింగ్ నిలిచిపోవడంతో ఫ్యాక్టరీ యార్డులో చెరకు నిల్వలు భారీగా పేరుకుపోయాయి.
కాగా గోవాడ ఫ్యాక్టరీలోని కో-జనరేషన్ ప్లాంటులో నెల రోజుల క్రితం ఒక టర్బయిన్ మొరాయించింది. పాడైన భాగాన్ని హైదరాబాద్ పంపించి మరమ్మతులు చేయించి ఇటీవల తీసుకునవచ్చారు. దీనిని అమర్చి టర్బయిన్‌ను వినియోగంలోకి తేవడానికి ప్రయత్నించగా దానికి అనుబంధంగా ఉన్న మరో పరికరం దెబ్బతిన్నది. దీంతో నెల రోజుల నుంచి ఒక టర్బయిన్ నుంచి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. గత సీజన్‌లో ఎదురైన ఆటంకాలు ఈ ఏడాది లేకుండా చేస్తామని అధికారులు చెప్పగా, క్రషింగ్ ఆరంభమైన తరువాత ఫ్యాక్టరీలో తరచూ ఏదో విభాగంలో యంత్రాలు మొరాయిస్తున్నారు. దీంతో చెరకు క్రషింగ్‌పై తీవ్రప్రభావం పడి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి ఫ్యాక్టరీలో జరుగుతున్న తప్పిదాలను అరికట్టాలని, నిపుణులైన సిబ్బందిని ఆయా స్థానాల్లో నియమించడంతోపాటు, సీజన్ ముగిసే వరకు చెరకు క్రషింగ్‌కు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.