Share News

ఏఎంసీలో అడ్వాన్స్‌డ్‌ స్కిల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2023-11-20T01:10:59+05:30 IST

దేశంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందికి మెరుగైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ స్కిల్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశ వ్యాప్తంగా వందకుపైగా స్కిల్‌సెంటర్స్‌ను ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని ఐదు మెడికల్‌ కాలేజీలకు మంజూరుచేసింది. ఇందులో ఒక సెంటర్‌ను మూడేళ్ల కిందట ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు మంజూరుచేయగా, కొద్దిరోజుల కిందట అందుబాటులోకి వచ్చింది.

ఏఎంసీలో అడ్వాన్స్‌డ్‌ స్కిల్‌ సెంటర్‌
మాడ్యూల్‌ ద్వారా శిక్షణ అందిస్తున్న దృశ్యం

వైద్యులు, వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందికి శిక్షణ

మెరుగైన వైద్య సేవలపై తర్ఫీదుకు అవకాశం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

దేశంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందికి మెరుగైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ స్కిల్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశ వ్యాప్తంగా వందకుపైగా స్కిల్‌సెంటర్స్‌ను ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని ఐదు మెడికల్‌ కాలేజీలకు మంజూరుచేసింది. ఇందులో ఒక సెంటర్‌ను మూడేళ్ల కిందట ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు మంజూరుచేయగా, కొద్దిరోజుల కిందట అందుబాటులోకి వచ్చింది. నేషనల్‌ ఎమర్జెన్సీ లైఫ్‌ సపోర్ట్‌ స్కిల్‌ ల్యాబ్‌ పేరుతో కేంద్రం మెడికల్‌ కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ల్యాబ్‌ ఏర్పాటుకు రూ.3.5 కోట్లను కేటాయించగా, భవన నిర్మాణానికి, ఇతర ఖర్చులకు రూ.2 కోట్లు, మరో రూ.1.5 కోట్లను పరికరాలకు కేటాయించింది. ఏఎంసీలో ఏర్పాటుచేసిన స్కిల్‌ ల్యాబ్‌లో ప్రస్తుతం 36 రకాల సిములేషన్‌ మోడల్స్‌ (మానవ శరీరాన్ని పోలి ఉండే ఆకృతులు) ఉన్నాయి. ఒక్కోదానిపై మూడు నుంచి నాలుగు రకాలైన వైద్యసేవలపై అనుగుణమైన శిక్షణ పొందేందుకు అవకాశముంది.

మెరుగైన వైద్య సేవలు అందించేలా..

సిములేషన్‌ మోడల్స్‌పై శిక్షణ పొందడం వల్ల రోగిపై శిక్షణ పొందిన అనుభవం వైద్యులు, వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందికి కలుగుతుంది. సీపీఆర్‌ (బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌, అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌), విషం తాగి వచ్చిన రోగికి అందించాల్సిన చికిత్స విషాన్ని కక్కించే పద్ధతి, గొంతులో ఏదైనా వస్తువు అడ్డం పడితే తీసే విధానం, ఊపిరితిత్తుతల్లో అడ్డంకులను తొలగించడం, లంగ్స్‌లో రక్తం చేరితే తొలగించే విధానం ఈసీజీలో మార్పులను గుర్తించి వైద్య సేవలు అందించే విధానం, గర్భిణులకు ప్రసవ సమయంలో ఎదరయ్యే ఇబ్బందులను పరిష్కరించడం, సుఖ ప్రసవంపై శిక్షణ అందిస్తున్నారు.

నైపుణ్యం మెరుగుకు వీలు

వైద్యులతోపాటు వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందిలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు సెంటర్‌ ఏర్పాటయింది. ఇప్పటివరకు రూ.1.35 కోట్ల విలువజేసే పరికరాలు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. ఏఎంసీ పరిధి బోధనాస్పత్రుల్లోని వైద్య సిబ్బంది, ప్రైవేటు కాలేజీలు, ఆస్పత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం.

- డాక్టర్‌ పద్మజ, నోడల్‌ ఆఫీసర్‌, స్కిల్‌ సెంటర్‌

Updated Date - 2023-11-20T01:11:01+05:30 IST