అదరహో!
ABN , First Publish Date - 2023-12-11T01:16:49+05:30 IST
సాగర జలాలపై యుద్ధ విమానాల కవాతు.. గగనతలంలో హెలికాప్టర్ల పహారా.. శత్రుమూకలపై నేవీ కమెండోల దాడులు..
అబ్బురపరిచిన నేవీ విన్యాసాలు
శరవేగంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు
హెలికాప్టర్ల నుంచి మెరుపు వేగంతో దిగిన కమెండోలు
బాంబుల మోతతో దద్దరిల్లిన ఆర్‌కే బీచ్ తీరం
అంగరంగ వైభవంగా నావికా దినోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్
పాల్గొన్న మంత్రులు విడదల రజిని, అమర్‌నాథ్
విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
సాగర జలాలపై యుద్ధ విమానాల కవాతు.. గగనతలంలో హెలికాప్టర్ల పహారా.. శత్రుమూకలపై నేవీ కమెండోల దాడులు.. వెరసి బీచ్ రోడ్డులో నేవీ విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఏటా డిసెంబరు నాలుగో తేదీన నిర్వహించే వేడుకలను ఈ ఏడాది మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నిర్వహించారు. సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైన విన్యాసాలు సుమారు రెండు గంటలపాటు నిర్విరామంగా సాగి నగరవాసులను అబ్బురపరిచాయి. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హాజరయ్యారు.
నేవీ డే వేడుకలు త్రివర్ణ పతాకం రంగులను వెదజల్లేలా పేల్చిన బాంబులతో ప్రారంభమయ్యాయి. పాంటమ్ లీడర్ కమాండర్ అశుతోష్ బోగ్డే నేతృత్వంలో ఐదు విమానాలతో చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి. పెద్ద శబ్దంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు, కమాండర్ వెంకటరామన్ సారథ్యంలోని జలాంతర్గమామి సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల సహాయంతో లెఫ్టెనెంట్ కమాండర్ విక్రమ్ కంక్రివాల్, వికాస్ సారథ్యంలోని మెరైన్ కమాండోలు చేసిన ప్రత్యేక ఆపరేషన్ హైలెట్‌గా నిలిచింది. తీరం వెంబడి శత్రు స్థావరాలపై మూకుమ్మడి దాడులు ఆకట్టుకున్నాయి. హెలికాప్టర్ల నుంచి మెరుపు వేగంతో దిగిన కమాండోలు చిన్న పడవలపై వచ్చి కాల్పులు జరుపుతూ, బాంబులు పేల్చుతూ శత్రుమూకలను సంహరించి, అమాయకులను కాపాడిన తీరు వాహ్వా అనిపించింది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ సాయంతో పేలిన ఆయిల్ రిగ్ అలలపై అగ్నికీలలను ఎగజిమ్మింది. శత్రువులకు వద్దకు చేరుకునేందుకు కఠినమైన భూభాగాల్లో వినియోగించే ఇన్‌ఫాంట్ ఫైటింగ్ వాహనాలతో పొగలు చిమ్ముతూ నేవీ సిబ్బంది దాడులు చేశారు. కెప్టెన్ రాజేష్ థామ్ ఆధ్వర్యంలోని ఆరుగురు మెరైన్ కమెండోలు పారాచూట్ సహాయంతో ఎనిమిది వేల అడుగులు ఎత్తు నుంచి దిగుతూ చేసిన విన్యాసాలు మెస్మరైజ్ చేశాయి. చీఫ్ ప్యాట్రన్ ఆఫీసర్ శివకుమార్ పారాచూట్ సాయంతో కిందకు దిగి గవర్నర్ నజీర్‌కు ప్రత్యేక జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్‌వర్మ, పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్, నేవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ రన్ విజయ్, ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ కిల్తాన్, ఐఎన్‌ఎస్ కవరతీ, ఐఎన్‌ఎస్ కంజర్ తమ శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పాయి. వీటిపై నుంచి నేవీ సిబ్బంది రాకెట్ ఫైరింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది.
నేవీ ఉద్యోగ జీవితంలోని కీలకమైన అంశాలతో విద్యార్థులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.
సామ్‌సాగర్ నేతృత్వంలోని హాక్ విమానాలు సందర్శకులను ఆలరించాయి. పెద్ద శబ్దంతో నాలుగు విమానాలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయాయి.
నాలుగు చేతక్ హెలికాప్టర్లతో లెప్టినెంట్ కమాండర్ అరుణ్‌రాగ్, ఇషాన్ కోర్, కెప్టెన్ అగ్నిహోత్రి, ఆయుష్ గోయెల్ నేతృత్వంలో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
మూడు చేతక్ హెలికాప్టర్లతో సెర్చ్, రెస్కూ ఆపరేషన్ చేసిన తీరు గగుర్పొడిచేలా చేసింది. సముద్రంలో చిక్కుకుపోయిన వారిని ప్రాణాలతో రక్షించే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. హెలికాప్టర్ల నుంచి కమాండోలు తాళ్లు, ప్రత్యేక పరికరాల సాయంతో కిందకు దిగారు.
మల్టీ వార్‌షిప్స్ ఐఎన్‌ఎస్ రణ్ విజయ్, ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ ఢిల్లీ యుద్ధ నౌకలపై హెలికాప్టర్లను ల్యాండ్ చేసిన తీరు ఆకట్టుకుంది. యుద్ధ సమయాల్లో వైద్య సహాయం అందించేందుకు, సెర్చ్ ఆపరేషన్స్‌లో యుద్ధనౌకలపై అత్యవసరంగా హెలికాప్టర్స్‌తో ల్యాండ్ అవుతుంటారు.
ముంబై దాడుల తరువాత తీర భద్రతకు ప్రవేశపెట్టిన ఐఎస్‌వీ, ఎఫ్‌ఐసీఎస్ నౌకలపై చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అత్యాధునిక పరికరాలు, రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో శత్రుమూకలపై వేగంగా దాడులకు పాల్పడేందుకు ఉపకరిస్తాయి.
కమాండర్ అగ్నిహోత్ని నేతృత్వంలోని చేతక్ హెలికాప్టర్లు బాణం ఆకారంలో నేలకు దగ్గరగా అలరించాయి. నాలుగు డార్నియర్ యుద్ధ విమానాలు, ఐదు హాక్ విమానాలు కనువిందు చేశాయి. హాక్ విమానాలు ఫైరింగ్ చేస్తూ సాగాయి. నేవీ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకోగా, విన్యాసాల ముగింపు సమయంలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైరింగ్ చేశాయి. యుద్ధ నౌకలు తీరంలో విద్యుత్ కాంతులతో మెరిశాయి.
సందర్శకులతో కిక్కిరిసిన తీరం
నేవీ డే వేడుకలను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే బీచ్ రోడ్డులో సందడి నెలకొంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నేవీ, పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఉడా పార్క్ నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వేలాదిగా చేరిన జనం విన్యాసాలు తిలకించారు. సెల్‌ఫోన్లతో వీడియాలను చిత్రీకరిస్తూ కనిపించారు.