ధాన్యం సొమ్ముకు ఏడాదిగా నిరీక్షణ!
ABN , First Publish Date - 2023-02-07T00:57:55+05:30 IST
వెలుగు అధికారుల నిర్లక్ష్యం నాగయ్యపేటకు చెందిన తొమ్మిది మంది రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. మూడు వారాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెలుగు సిబ్బంది చెప్పారు.

నాగయ్యపేటలో 9 మంది రైతుల నుంచి 150 క్వింటాళ్లు సేకరణ
2021-22లో క్వింటా మద్దతు ధర రూ.1,960
మొత్తం రూ.2,92,552 వస్తుందని వెల్లడి
21 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న అధికారులు
పద్మనాభం మండలం పాండ్రంగి రైస్ మిల్లుకు సరఫరా
వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయని వెలుగు సిబ్బంది
వెబ్‌సైట్ క్లోజ్ కావడంతో రైతులకు అందని డబ్బులు
దేవరాపల్లి, ఫిబ్రవరి 6: వెలుగు అధికారుల నిర్లక్ష్యం నాగయ్యపేటకు చెందిన తొమ్మిది మంది రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. మూడు వారాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెలుగు సిబ్బంది చెప్పారు. ధాన్యాన్ని పద్మనాభం మండలంలోని ఒక రైస్ మిల్లుకు సరఫరా చేశారు. మూడు వారాలు.. మూడు నెలలు... ఏడాది అవుతున్నా డబ్బులు రాలేదు. ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లు యజమానిని అడిగితే... అదే గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చేశానని చెబుతున్నాడు. ఆ వ్యక్తిని అడిగితే మిల్లు యజమాని ఇవ్వలేదని చెబుతున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇందుకు సంబంధించి బాధిత రైతులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
దేవరాపల్లి మండలం నాగయ్యపేటకు చెందిన ఆదిరెడ్డి ఈశ్వరరావు, కర్రి అప్పలనాయుడు, జామి శ్రీరామ్మూర్తి, జామి రాములమ్మ, వేచలపు నారాయణమ్మ, కె.దేముడు, ఎస్.రాము, జె.సింహాచలమ్మ, కె.సూరిబాబు గత ఏడాది ఫిబ్రవరిలో ‘వెలుగు’ సిబ్బంది ఏర్పాటు చేసిన కేంద్రంలో సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. 2021-22లో కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరలు సాధారణ రకం అయితే క్వింటా రూ.1,940, ఏ గ్రేడ్ అయితే రూ.1,960లుగా ప్రకటించింది. నాగయ్యపేటకు రైతులు విక్రయించిన ధాన్యం ఏ గ్రేడ్ రకం కావడంతో క్వింటాకు రూ.1,960 చొప్పున మొత్తం రూ.2,92,552 ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో 21 రోజుల్లో జమ అవుతాయని వెలుగు సిబ్బంది చెప్పారు. అనంతరం వెలుగు ఏపీఎం బీడీ తిలక్.. ఈ ధాన్యాన్ని పద్మనాభం మండలం పాండ్రంగిలోని ఒక రైస్ మిల్లుకు తరలించారు. అయితే రైతులు విక్రయించిన ధాన్యం వివరాలను వెలుగు సిబ్బంది సకాలంలో ఆన్‌లైన్ చేయలేదు. దీంతో సంబంధిత వెబ్‌సైట్ క్లోజ్ అయ్యింది. కానీ ఈ విషయాన్ని రైతులకు చెప్పలేదు. మూడు వారాలు దాటినా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో వెలుగు అధికారులను అడిగారు. కొద్ది రోజుల్లో డబ్బులు వస్తాయని చెప్పారు. కానీ వారాలు.. నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదు. దీంతో విసిగిపోయిన రైతులు గత ఏడాది డిసెంబరు 12వ తేదీన అనకాపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం ధాన్యం సరఫరా అయిన పాండ్రంగిలోని రైస్ మిల్లు యజమానిని కలిసి ధాన్యం డబ్బుల గురించి అడిగారు. నాగయ్యపేటకు చెందిన ఒక వ్యక్తికి కొంత మొత్తం ఇచ్చానని, మిగిలిన సొమ్ము త్వరలో ఇస్తానని అతను చెప్పాడు. రైతులు గ్రామానికి తిరిగి వచ్చి సదరు వ్యక్తిని వాకబు చేయగా, రైస్ మిల్లు యజమాని తనకు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి రెండు నెలలు అయినా ధాన్యం డబ్బులు అందలేదని వాపోతున్నారు.
రూ.24,750 రావాలి
కర్రి అప్పలనాయుడు, రైతు, నాగయ్యపేట
గత ఏడాది ఫిబ్రవరిలో 33 బస్తాల (ఒక్కొక్కటి 40 కిలోలు) ధాన్యం విక్రయించాను. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రూ.24,750 వస్తాయని, మూడు వారాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయని అధికారులు చెప్పారు. కానీ ఎన్ని వారాలు గడిచినా డబ్బులు అందలేదు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగాను. ఇటీవల రూ.5 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడంలేదు.
వారం రోజుల్లో చెల్లింపులు
ప్రభాకర్, వెలుగు ఏపీఎం
నాగయ్యపేట రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పాండ్రంగిలోని ఒక రైస్ మిల్లుకు సరఫరా చేశాం. డబ్బులు విషయమై ఇటీవల పాండ్రంగి వెళ్లి మిల్లు యజమానిని అడిగాము. కొంతసొమ్మును నాగయ్యపేటకు చెందిన ఒక వ్యక్తి బాం్యకు ఖాతాకు వేసినట్టు చెబుతున్నాడు. వారం రోజుల్లో నాగయ్యపేటకు వచ్చి మిగిలిన డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు.