త్వరలో శాటిలైట్ డిపో ఏర్పాటు
ABN , First Publish Date - 2023-03-19T01:02:27+05:30 IST
జిల్లా నుంచి తెలంగాణ సరిహద్దుల్లో గల ముంపు మండలాల ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రజా రవాణా శాఖ(పీటీడీ) చర్యలు చేపడుతున్నదని ఆ సంస్థ జోన్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం సీలేరులో శాటిలైట్ డిపోను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు.

పీటీడీ ఈడీ రవికుమార్
సీలేరులో స్థల పరిశీలన
సీలేరు, మార్చి 18 : జిల్లా నుంచి తెలంగాణ సరిహద్దుల్లో గల ముంపు మండలాల ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రజా రవాణా శాఖ(పీటీడీ) చర్యలు చేపడుతున్నదని ఆ సంస్థ జోన్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం సీలేరులో శాటిలైట్ డిపోను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. శనివారం సీలేరు వచ్చిన ఆయన శాటిలైట్ డిపో ఏర్పాటు కోసం ఇటీవల రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన గ్యాస్ గోదాము వద్ద గల ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు, సంస్థ ఆదాయాన్ని మరింత పెంచే చర్యల్లో భాగంగా పాడేరు నుంచి సీలేరు మీదుగా ఏటపాకకు, అక్కడ నుంచి తిరిగి పాడేరు వెళ్లేందుకు రెండు బస్సులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలకు, అక్కడి ఉద్యోగులు జిల్లా కేంద్ర కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈ బస్సులు తిరుగుతాయన్నారు. సీలేరు నుంచి చింతూరుకు, సీలేరు నుంచి చింతపల్లికి, సీలేరు నుంచి ఒడిశాకు రెగ్యులర్‌గా సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖపట్నం- సీలేరు నైట్ హాల్ట్ బస్సును త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అప్పలనాయుడు, పాడేరు డీఎం నాయుడు ఉన్నారు.