అలుపెరుగని పోరు

ABN , First Publish Date - 2023-09-26T01:36:13+05:30 IST

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లాలో వేర్వేరు రూపాల్లో తమ ఆందోళన వ్యక్తపరచారు.

అలుపెరుగని పోరు

చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో

అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు

ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ

పూజలు, ప్రార్థనలు, ప్రదర్శనలు

సెల్‌ఫోన్‌ టార్చ్‌లతో నేతల ర్యాలీ

అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లాలో వేర్వేరు రూపాల్లో తమ ఆందోళన వ్యక్తపరచారు. ఒకవైపు నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగిస్తూనే మరోవైపు ఇంటింటికీ కరపత్రాల పంపిణీ ప్రారంభించారు. మరికొన్నిచోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.

తమ అధినేత అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా కార్యక్రమాలు చేపడుతున్నా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే అప్పటికే కార్యాలయం వద్ద పోలీసులు మోహరించడంతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా...అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చివరకు సెల్‌ఫోన్‌ల టార్చ్‌లతో పార్టీ కార్యాలయం నుంచి నేతలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, పాశర్ల ప్రసాద్‌, బండారు అప్పలనాయుడు, పుచ్చా విజయకుమార్‌, పీఎస్‌ నాయుడు, సర్వసిద్ధి అనంతలక్ష్మి, పైలా ముత్యాలనాయుడు, ఉరుకూటి డేవిడ్‌, ప్రణవ్‌గోపాల్‌, తదితరులు ఎల్‌ఐసీ జంక్షన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. చివరకు నేతలందరినీ అరెస్టు చేసి పోలీస్‌ బ్యారెక్స్‌కు తీసుకువెళ్లి, కొద్దిసేపటి తరువాత విడిచిపెట్టారు.

కాగా ఉదయం దక్షిణ నియోజకవర్గంలోని 32వ వార్డులో గండి బాబ్జీ, తూర్పు నియోజకవర్గంలోని 10, 12 వార్డుల్లో కార్పొరేటర్‌ మద్దిల రామలక్ష్మి, పార్టీ నాయకుడు ఒమ్మి సన్యాసిరావులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కుట్రను వివరిస్తూ కరపత్రాలు పంచారు. భీమిలి పట్టణ కార్యాలయంలో పద్మనాభం మండల నాయకులు దామోదరరావు, తదితరులు మోకాళ్లపై నిల్చొని తమ నిరసన తెలిపారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉత్తరం నియోజకవర్గంలోని గంగన్ననగర్‌ శివాలయంలో ఇన్‌చార్జి విజయబాబు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. పశ్చిమలో ఎమ్మెల్యే పి.గణబాబు ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పాతగాజువాకలో టీడీపీ నేతలు శిబిరం ముందు చెరసాల మాదిరిగా గ్రిల్‌ ఏర్పాటుచేసి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్‌రెడ్డి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెందుర్తి పరిధిలో 77వ వార్డు నమ్మిదొడ్డి జంక్షన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబును అరెస్టు చేసి సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు.

Updated Date - 2023-09-26T01:36:13+05:30 IST