వైసీపీ నేత సోదరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2023-08-22T23:48:43+05:30 IST

అధికార వైసీపీకి చెందిన ఒక నేత సోదరిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కేవీ సత్యనారాయణ చెప్పారు.

వైసీపీ నేత సోదరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సత్యనారాయణ

అత్యాచారయత్నం జరిగిందన్న ప్రచారం అవాస్తవం

డీఎస్పీ కేవీ సత్యనారాయణ వెల్లడి

పరవాడ, ఆగస్టు 22: అధికార వైసీపీకి చెందిన ఒక నేత సోదరిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కేవీ సత్యనారాయణ చెప్పారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

పరవాడ గ్రామానికి చెందిన వైసీపీ నేత సోదరి ఈనెల 12వ తేదీ సాయత్రం తన పెంపుడు కుక్కతో జాగింగ్‌కు వెళ్లి కొంతసేపటి తరువాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తన చెవి రింగు పోయినట్టు అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తించింది. రింగ్‌ కోసం జాగింగ్‌కు వెళ్లి వచ్చిన రహదారిలో వెతుక్కుంటూ వెళుతున్నది. ఈ సమయంలో ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై అటుగా వెళుతూ సదరు యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శరీరాన్ని తాకాలని ప్రయత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అతను పరారయ్యాడు. జరిగిన విషయంపై ఆమె మరుసటి రోజు (13వ తేదీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన ఆనవాళ్లతోపాటు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు పరవాడ రామాలయం వీధిలో నివాసముంటున్న అబ్బిరెడ్డి సంతోశ్‌కుమార్‌గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఒప్పుకున్నాడు. ఇతను ఫార్మాసిటీలోని ఒక పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడిపై ఈవ్‌ టీజింగ్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, సదరు యువతిపై అత్యాచారయత్నం జరిగిందన్న ప్రచారం అవాస్తవమని డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:48:43+05:30 IST