Share News

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:39 AM

ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ వ్యక్తి శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సతీశ్‌కుమార్‌ మృతదేహం

కూర్మన్నపాలెం, డిసెంబరు 23: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ వ్యక్తి శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 86వ వార్డు రాజీవ్‌నగర్‌ సమీపంలోని రాసాలమ్మ కాలనీకి చెందిన కుచ్చర్లపాటి సతీశ్‌కుమార్‌ (31) భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఎలక్ట్రికల్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సతీశ్‌కుమార్‌ తరచూ బెట్టింగ్‌లు ఆడుతుండేవాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 20 రోజుల క్రితమే తాను చనిపోతానని, పిల్లలను బాగా చూసుకోవాలని భార్యతో అన్నాడు. దీంతో ఆమె సెల్‌ ఫోన్‌ వల్ల బెట్టింగ్‌లు ఎక్కువవుతున్నాయని దానిని తీసుకుంది. శనివారం ఉదయం భాగ్యలక్ష్మిని టిఫిన్‌ కొని తెమ్మని చెప్పడంతో ఆమె బయటకు వెళ్లి వచ్చేసరికి సతీశ్‌కుమార్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:39 AM